Delhi : కాంగ్రెస్ బలోపేతంపై అధిష్ఠానం దృష్టి
ABN , Publish Date - Aug 13 , 2024 | 05:06 AM
కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు వ్యూహ రచన చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడం, కాంగ్రెస్ వంద మార్కును దాటడంతో పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారనే భావన ఆ పార్టీలో కలిగింది.
సంస్థాగతంగా బలపడేందుకు వ్యూహ రచన
నేడు అన్ని రాష్ర్టాల అధ్యక్షులతో సమావేశం
హాజరుకానున్న పీసీసీ చీఫ్ షర్మిల
న్యూఢిల్లీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు వ్యూహ రచన చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడం, కాంగ్రెస్ వంద మార్కును దాటడంతో పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారనే భావన ఆ పార్టీలో కలిగింది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాలని అధినాయకత్వం భావిస్తున్నది.
అందులో భాగంగానే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు, అన్ని రాష్ర్టాల పీసీసీ అధ్యక్షులు, రాష్ర్టాల ఇంచార్జీలతో సమావేశం నిర్వహిస్తున్నది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది.
ఆంధ్ర నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ప్రత్యేకంగా షర్మిల కలిసే అవకాశం ఉన్నది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించిన అన్ని విభాగాలను రద్దు చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కమిటీల రద్దు నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త కమిటీల నియామకం ఉంటుందని అప్పట్లో పార్టీ ప్రకటించింది. వారితో ఆ కొత్త కమిటీల నియామకం, రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు, ప్రస్తుత పరిస్థితులు, పార్టీ బలోపేతంపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది.