Share News

Marriage Fraud: బాబోయ్.. వీడు మామూలోడు కాదుగా.. ఏకంగా 50మంది మహిళల్ని..

ABN , Publish Date - Sep 20 , 2024 | 10:50 AM

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముకీమ్‌ఖాన్ అనే వ్యక్తి ఓ మ్యాట్రిమోనీ వైబ్‌సైబ్ క్రియేట్ చేశాడు. ఫేక్ ఐడీలతో తాను ప్రభుత్వ ఉద్యోగినని, భార్య చనిపోయిందని చెప్పేవాడు. వివిధ ప్రాంతాలకు చెందిన పెళ్లికాని ముస్లిం యువతులు, మహిళలు, వితంతువులనే టార్గెట్ చేసేవాడు.

Marriage Fraud: బాబోయ్.. వీడు మామూలోడు కాదుగా.. ఏకంగా 50మంది మహిళల్ని..

ఉత్తర్ ప్రదేశ్: మనం అప్పుడప్పుడు నిత్య పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ల గురించి వింటూనే ఉంటాం. మాయమాటలు చెప్పి ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేసిన అనేక ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. మేమేమీ తక్కువ కాదంటూ కొంతమంది మహిళలు సైతం ఇలాంటి దారుణ మోసాలకు పాల్పడుతుంటారు. కట్నం కింద నగదు, బంగారం తీసుకుని రాత్రికి రాత్రే ఉడాయించే కేటుగాళ్లు కొందరైతే, పెళ్లి కాని యువకులకు వల పన్ని అనేక రకాలుగా డబ్బులు వసూలు చేసి చివరికి ముఖం చాటేసే అమ్మాయిలు మరికొందరు.


ఈ మధ్య కాలంలో పెళ్లికాని వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇందుకు ఇంట్లో కుదిర్చే సంబంధాలు నచ్చక, తమ స్థాయికి తగ్గ ఉద్యోగం, ఆస్తులు ఉన్న వ్యక్తులను పెళ్లాడాలనుకోవడం కారణం. అలాంటి వారు పెళ్లి చేసుకునేందుకు బ్రోకర్లు, మ్యాట్రిమోనీల సహాయం తీసుకుంటున్నారు. దీంతో మోసాల సంఖ్య బాగా పెరిగిపోయింది. మనకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు మ్యాట్రిమోనీ సైట్లలో ఉంటారు. కొంతమంది కేటుగాళ్లు సైతం ఫేక్ ఐడీలతో అందులో దర్శనమిస్తారు. ఒక్కసారి కనెట్క్ అయ్యామంటే మంచిగా మాట్లాడి మన కుటుంబ వివరాలు సేకరిస్తారు. గిట్టుబాటు అవుతుందనుకుంటే వల పన్ని నిండా ముంచుతారు.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50మంది మహిళల్ని ఓ కేటుగాడు పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇక్కడ మరో సంచలన విషయం ఉంది. మోసపోయిన వారిలో ఏకంగా ఓ మహిళా జడ్జి ఉన్నారంటే అతను ఏ రెంజ్‌లో బురిడీ కొట్టిస్తాడో అర్థం చేసుకోవచ్చు. పాపం పండడంతో ఢిల్లీ పోలుసులు నిందితుణ్ని కటకటాల వెనక్కి నెట్టారు.


ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముకీమ్‌ఖాన్ అనే వ్యక్తి ఓ మ్యాట్రిమోనీ వైబ్‌సైబ్ క్రియేట్ చేశాడు. ఫేక్ ఐడీలతో తాను ప్రభుత్వ ఉద్యోగినని, భార్య చనిపోయిందని చెప్పేవాడు. వివిధ ప్రాంతాలకు చెందిన పెళ్లికాని ముస్లిం యువతులు, మహిళలు, వితంతువులనే టార్గెట్ చేసేవాడు. ఏకంగా 50మందిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి పెళ్లిమండపాల బుకింగ్ కోసం, ఇతరత్రా కారణాలు చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షలు వసూలు చేసేవాడు. నగదు చేతికి చిక్కాక పరారయ్యేవాడు. ఇలా ఏకంగా ఓ జడ్జి సహా 50మందిని బురిడీ కొట్టించాడు. దీనికి సంబంధించి ఓ బాధితురాలు ఢిల్లీ పోలీసులను ఆక్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టిన నిందితుడు ముకీన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయం అయ్యే యువతీ, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ నమ్మి ముందే డబ్బులు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Sep 20 , 2024 | 10:50 AM