Share News

Viral Video: ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్లు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్!

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:01 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న చిన్న విషయాలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. కొందరైతే నిజానిజాలు నిర్ధారించుకోకుండానే.. ఏవేవో వీడియోలు షేర్ చేస్తుంటారు. వాటిపై తమ అభిప్రాయాలు..

Viral Video: ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్లు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్!

ప్రస్తుత సోషల్ మీడియా (Social Media) యుగంలో చిన్న చిన్న విషయాలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. కొందరైతే నిజానిజాలు నిర్ధారించుకోకుండానే.. ఏవేవో వీడియోలు షేర్ చేస్తుంటారు. వాటిపై తమ అభిప్రాయాలు రుద్దుతుంటారు. ఫలితంగా.. అవి అనూహ్య వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇప్పుడు రైల్వేకు (Railways) సంబంధించిన ఓ వీడియో సైతం తెగ హల్‌చల్ చేస్తోంది. ఏకంగా రైల్వే పైనే నిందలు వేసే స్థాయికి వ్యవహారం వెళ్లింది. రైల్వేలోని భద్రతా లోపాలకు ఈ వీడియో అద్దంపడుతోందంటూ విమర్శలు గుప్పించారు. చివరకు అసలు నిజం తెలిశాక నెటిజన్లు నాలుక్కరచుకున్నారు. అసలు ఏమైందంటే..

Read Also: కొత్త చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్.. బాయ్‌కాట్ చేయాలంటూ


ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్ల వీడియో

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోని గమనిస్తే.. అందులో నాలుగు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉండటాన్ని గుర్తించవచ్చు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో లింగరాజ్‌ స్టేషన్‌ వద్ద ఈ దృశ్యం కనిపించగా.. ఎవరో దానిని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి నెట్టింట్లో పోస్టు చేశారు. ఇది చూసిన నెటిజన్లు.. అసలు నిజమేంటో తెలుసుకోకుండా రైల్వే శాఖపై దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. రైల్వేలోని భద్రతా లోపాలకు ఈ వీడియోనే సాక్ష్యమని.. ఇలాంటి నిర్లక్ష్య ధోరణుల కారణంగానే ఈమధ్య కాలంలో రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు ఎక్కు పెట్టారు. వాణి మెహ్రోత్రా అనే ఓ నెటిజన్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఒకే ట్రాక్‌పైకి నాలుగు రైళ్లు వచ్చాయని, ఈ విషయాన్ని ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే ఈస్ట్ కోస్ట్ రైల్వే (East Coast Railway) దీనిపై స్పందించింది.

Read Also: అక్కడ సీన్ రివర్స్.. భార్యలే తమ భర్తలకు..


అసలు నిజం ఇది

ఒకే లైన్‌లో నాలుగు రైళ్లు ఉన్న ఈ వీడియోను తొలుత ఒక జాతీయ మీడియా ట్వీట్ చేసిందని, ఆపై మిగిలిన మీడియా ఛానెళ్లు కూడా దానిని అనుసరించాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. అయితే.. ఈ వీడియో ఆటో సెక్షన్‌లోనిది అని, ఆ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌పై నాలుగు మాత్రమే కాదు, అనేక రైళ్లు నిలవొచ్చని స్పష్టం చేసింది. ఇదేమీ భద్రతాపరమైన లోపం కాదని వెల్లడించింది. సెక్షన్‌ కెపాసిటీతో పాటు భద్రతను పెంచడమే ఈ సాంకేతిక ఉద్దేశమని.. ప్రతిరోజూ వందలాది రైళ్లు ఈ ఆటో సిగ్నలింగ్‌ సెక్షన్‌లోనే రాకపోకలు సాగిస్తుంటాయని పేర్కొంది. ఈ విషయం తెలుసుకోకుండా అందరూ ఏదేదో ఊహించేసుకొని విమర్శలు చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి వార్తలు రైల్వే ప్రతిష్టమే దెబ్బ తీస్తాయని.. కాబట్టి ఏదైనా వార్త రాసేముందు ఓసారి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 06:07 PM