ఆప్ ఖాతాలో రూ.7 కోట్ల విదేశీ నిధులు:ఈడీ
ABN , Publish Date - May 21 , 2024 | 04:47 AM
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) నిబంధనలకు విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-2022 నడుమ రూ.7 కోట్ల మేర విదేశీ నిధులను అందుకున్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఈడీ గత ఏడాది ఆగస్టులోనే ఒక లేఖ రాసింది.
న్యూఢిల్లీ, మే 20: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) నిబంధనలకు విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-2022 నడుమ రూ.7 కోట్ల మేర విదేశీ నిధులను అందుకున్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఈడీ గత ఏడాది ఆగస్టులోనే ఒక లేఖ రాసింది. తాజాగా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కేంద్ర హోం శాఖకు ఈడీ అందజేసింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకూ సార్వత్రిక ఎన్నికల ఆరో దశ అయిన మే 25న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
అలాగే పంజాబ్‌లో జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఆప్ బలంగా ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఈడీ ఈ వ్యవహారాన్ని మళ్లీ బయటకు తీసుకురావడం గమనార్హం. 2014-22 నడుమ విదేశాల్లో ఉంటున్న వారి నుంచి రూ.7.08 కోట్ల మేర విదేశీ విరాళాలు అందుకున్న ఆప్.. దాతల వివరాలను తప్పుగా ప్రకటించిందని, వారికి సంబంధించిన కొన్ని వివరాలను దాచిపెట్టిందని ఈడీ ఆరోపిస్తోంది.
ఎఫ్సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు బాధ్యత సీబీఐది కాబట్టి.. ఈకేసును సీబీఐకి అప్పగిస్తూ లేఖ రాయాలని హోం శాఖను కోరింది. అయితే.. ఈడీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆప్‌నేత ఆతిషీ కొట్టిపారేశారు. ఇది ఎన్నికల ముందు ఆప్‌ను అపఖ్యాతిపాలు చేసేందుకు మోదీ పన్నిన కుట్ర అని మండిపడ్డారు.