EC: 64.2 కోట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు
ABN , Publish Date - Jun 04 , 2024 | 02:45 AM
లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది ప్రపంచ రికార్డు
భారత ఎన్నికలు ఓ అద్భుతం
ఏడు దశల్లో.. రూ.10 వేల కోట్ల
నగదు స్వాధీనం చేసుకున్నాం
పత్తాలేని పెద్దమనుషులం కాదు.. ఎప్పుడూ అందుబాటులో ఉన్నాం
త్వరలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ: సీఈసీ రాజీవ్‌కుమార్
న్యూఢిల్లీ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జీ7 దేశాల ఓటర్లతో పోలిస్తే భారత్‌లో ఈ ఎన్నికల్లో ఓటేసిన వారి సంఖ్య ఒకటిన్నర రెట్లు ఎక్కువని.. యూరోపియన్ యూనియన్‌లో ఉన్న 27 దేశాల ఓటర్ల కంటే రెండున్నర రెట్లు ఎక్కువని తెలిపారు. 31.2 కోట్ల మహిళా ఓటర్లు పార్లమెంటు ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.
సోమవారం ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి రాజీవ్‌కుమార్ పాత్రికేయులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకున్న ఓటర్లందరికీ కృతజ్ఞతభావంతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
85 ఏళ్లు దాటిన ఓటర్లు ఈ తరానికి ఆదర్శమని.. గత 70 ఏళ్లుగా వారు దేశం పట్ల తమ బాధ్యతను నేరవేరుస్తున్నారని రాజీవ్‌కుమార్ కొనియాడారు. గత నాలుగు దశాబ్దాలలో ఎప్పుడూ లేనివిధంగా జమ్ముకశ్మీర్‌లో ఈసారి అత్యధికంగా ఓటింగ్ జరిగిందన్న ఆయన.. జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అక్కడ నమోదైన ఓటింగ్ పట్ల ఈసీ సంతోషంగా ఉందని.. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి ప్రజల ఉత్సుకతకు కశ్మీర్‌లో పోలింగ్ శాతమే నిదర్శనమని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని.. డీప్‌ఫేక్ వీడియోల బెడదను నియంత్రించామని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన అధికారులపై ఏఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. నియమావళిని ఉల్లంఘించిన నాయకులకు నోటీసులు జారీ చేశామని గుర్తుచేశారు. ఎన్నికల సిబ్బంది సమర్థంగా పనిచేయడంతో ఈసారి అతి తక్కువగా 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని.. అందులోనూ 25 చోట్ల రీపోలింగ్ రెండు రాష్ట్రాలలోనే జరిగిందని వివరించారు. గత లోక్‌సభ ఎన్నికలలో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించినట్లు గుర్తుచేశారు.
సామాజిక మాధ్యమాలలో ఎన్నికల సంఘాన్ని ’లాపతా జెంటిల్మెన్ (పత్తా లేని పెద్దమనుషులు)’ గా అభివర్ణిస్తూ వైరల్ అవుతున్న మీమ్స్ పట్ల సీఈసీ స్పందించారు. తాము ఎక్కడికీ పోలేదని, ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నామని చెప్పారు. ఏపీలో ఎన్నికల అనంతరం భద్రతాబలగాల బందోబస్తును కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 23 దేశాలకు చెందిన 75 మంది ప్రతినిధులు లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను పరిశీలించినట్లు వెల్లడించారు.
కోటిన్నర మంది..
కోటిన్నర మంది పోలింగ్, భద్రతా సిబ్బంది, 68 వేల పర్యవేక్షణ బృందాలు ఈ ఎన్నికల బృహత్తర యజ్ఞంలో పాలుపంచుకున్నట్టు రాజీవ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా నాలుగు లక్షల వాహనాలను, 135 ప్రత్యేక రైళ్లను, 1692 ట్రిప్పుల హెలికాఫ్టర్/విమాన సేవలను వినియోగించుకున్నామని చెప్పారు. అలాగే.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు తరలిస్తున్న నగదు, వస్తువులు, మాదకద్రవ్యాలు, మద్యం.. ఇలా అన్నింటినీ కలిపితే తాము స్వాధీనం చేసుకున్నవాటి విలువ రూ.10వేల కోట్ల దాకా ఉంటుందని తెలిపారు.
2019లో ఇలా స్వాధీనం చేసుకున్నవాటి విలువ రూ.3500 కోట్లేనని వివరించారు. కౌంటింగ్‌లో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ ఫలితాలను వెల్లడించాలన్న విపక్షాల విజ్ఞప్తిపై సీఈవో వివరణ ఇచ్చారు. నిబంధనల ప్రకారం.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగానే లెక్కించనున్నట్లు తెలిపారు. ఆ ఓట్లను లెక్కించడం మొదలుపెట్టిన అరగంట తర్వాతే ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తామన్నారు.
ఢిల్లీకి ఇండియా కూటమి నేతలు
ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతల పిలుపు మేరకు తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, ఇతర మిత్రపక్షాల నేతలు ఢిల్లీకి వస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే వీరంతా సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఫలితాలు అనుకున్న విధంగా, అనుకూలంగా రాకపోతే.. ఇతర మార్గాలను అన్వేషించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రపతిని కలవడం, మీడియా సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణలో ఈసీ పాత్రపైనా చర్చించాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారని తెలిసింది. ఎన్‌డీయేకు 350కి పైగా స్థానాలు వస్తే ఎన్నికల ప్రక్రియ బూటకమని భావించాలని వారు తీర్మానించినట్లు సమాచారం.