Lok Sabha Elections: అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఇదే చివరిదశ..!
ABN , Publish Date - May 31 , 2024 | 08:29 PM
సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో శనివారంతో ఎన్నికలు ముగియనున్నాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరిదశలో 8రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ 42స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల(General Elections 2024) ఏడో దశ పోలింగ్(7th phase polling)కు సర్వం సిద్ధం అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో శనివారంతో ఎన్నికలు ముగియనున్నాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరిదశలో 8రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్‌సభ(Lok sabha), ఒడిశా అసెంబ్లీ 42స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో దేశవ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దాడులు ప్రతిదాడులతో రెచ్చిపోయారు. చివరిదశ పోలింగ్‌లో ఎన్నికల తంతుకు దేశవ్యాప్తంగా తెరపడనుంది.
ఏఏ రాష్ట్రాల్లో ఎన్నికలు, ఓటర్లు ఎంతమందంటే..?
చివరిదశలో భాగంగా బిహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఒడిశా అసెంబ్లీ 42స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో 10.06కోట్ల మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. దీని కోసం 1.09లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. జూన్ 1న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. 10.06కోట్ల మంది ఓటర్లలో 5.24కోట్ల మంది పురుషులు, 4.82కోట్ల మంది మహిళా ఓటర్లు, 3574మంది థర్డ్ జెండర్ ఉన్నారు.
పోలింగ్ ఏర్పాట్లు పూర్తి..
ఎన్నికల నిర్వహణకు కేంద్రం ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. 13ప్రత్యేక రైళ్లు, 8హెలికాప్టర్లతో పోలింగ్ సిబ్బందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 64మంది సాధారణ, 32మంది పోలీస్ సహా మొత్తం 172మంది పరిశీలకుల పర్యవేక్షణలో పోలింగ్ కొనసాగనుంది. 201అంతర్జాతీయ సరిహద్దుల్లో, 906అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలూ జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయించింది.
ఎక్కడెక్కడ ఎవరెవరూ నిలిచారంటే..
ఏడో విడత ఎన్నికల్లో 904మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా పంజాబ్‌లో 328మంది ఉండగా.. 144మంది అభ్యర్థులతో యూపీ రెండో స్థానంలో నిలించింది. బిహార్ 134, ఒడిశా 66, ఝార్ఖండ్ 52, హిమాచల్ 37, చండీగఢ్ 19మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా కొన్ని స్థానాల ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ మూడోసారి పోటీ చేస్తుండగా.. ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. 2014, 2019ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ప్రధాని మోదీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడోసారి ఆయన హ్యాట్రిక్ కొడతారంటూ బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో నియోజకవర్గం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఆ నియోజకర్గం నుంచి ఫైర్ బ్రాండ్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా నిలిచారు. ఎన్నికల ప్రచారం మెుదలైన నాటి నుంచి ఆమె పలు వివాదాలతో హాట్ టాపిక్‌గా నిలిచారు. మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ ఆ పార్టీ నుంచి రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్యసింగ్ పోటీలో ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో బీజేపీ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ అభ్యర్థిగా సత్‌పాల్ సింగ్ రాయ్‌జాదా తలపడుతున్నారు. అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి వరసగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పుర్‌లో సినీనటుల మధ్య పోటీ కావడంతో నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫున భోజ్‌పురీ నటుడు రవికిషన్ పోటీ చేస్తుండగా.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి నటి కాజల్ నిషాద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
For Latest News and National News click here