Share News

PM Modi: నాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. సీక్రెట్ బయటపెట్టిన మోదీ..

ABN , Publish Date - May 20 , 2024 | 07:30 PM

ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పని చేయడమే తనకు తెలుసని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పదవుల కోసం, గుర్తింపు కోసం ఆలోచించనని.. తాను కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi: నాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. సీక్రెట్ బయటపెట్టిన మోదీ..
PM Modi

ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పని చేయడమే తనకు తెలుసని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పదవుల కోసం, గుర్తింపు కోసం ఆలోచించనని.. తాను కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. లక్ష్య సాధన కోసం దేనికైనా సిద్ధమని.. ఏం చేసేందుకైనా వెనుకాడబోనని తెలిపారు. నిస్వార్థంగా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని మోదీ పేర్కొన్నారు. బ్రాండ్ మోదీపై అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. ప్రజలు తనను విశ్వసించడం వలనే ఆ పేరు వచ్చిందని.. దానికోసం ప్రత్యేకంగా చేసిందేమి లేదన్నారు. నాయకుడు ప్రజల గుర్తింపు పొందడం చాలా ముఖ్యమని.. ప్రజా విశ్వాసమే తనకు బ్రాండ్ మోదీ పేరు రావడానికి కారణమన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను దేశం ప్రత్యక్షంగా చూస్తోందన్నారు. తాను మనిషినేనని తప్పులు జరుగుతుంటాయి.. కానీ దురుద్దేశంతో ఇప్పటివరకు ఎలాంటి పొరపాటు చేయలేదని ప్రధాని మోదీ తెలిపారు.

Lok Sabha Elections 2024 : కాంగ్రెస్‌లో మమత చిచ్చు!


అధికారంలోకి వస్తే..

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లో ఏమి చేయాలో ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. మొదటి వంద రోజుల్లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), జమిలి ఎన్నికలపై చట్టం తీసుకొస్తారా అన్న ప్రశ్నకు.. ఈ రెండూ తమ పార్టీ మేనిఫెస్టోలో భాగమేనని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు. అధికారం చేపట్టిన తర్వాత తొలి 100 రోజుల ప్రణాళికను ముందుగానే నిర్ణయించుకోవడం తనకు గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచే అలవాటుగా ఉండేదన్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు సార్లు అలాగే చేశానని.. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మరో 25 రోజులు అదనంగా చేర్చాలనుకుంటున్నట్లు చెప్పారు. 125 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.


సౌత్‌లో మెజార్టీ..

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సౌత్‌లో బీజేపీకి మద్దతు లేదనేది ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం మాత్రమేనని.. అందులో వాస్తవం లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో అధికారానికి అవసరమైన మెజార్టీ సీట్లను బీజేపీ సాధిస్తుందని.. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాలు మరిన్ని సీట్లను సాధిస్తాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమకు ఓట్ల శాతంతో పాటు సీట్ల శాతం పెరుగుతాయని మోదీ చెప్పారు.


గెలుపు దిశగా..

ఇప్పటివరకు వివిధ దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ముందుందని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరవడానికే ఇండియా కూటమి విపరీతంగా కష్టపడుతుందన్నారు. ప్రజల మద్దతుతోనే మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటుకాబోతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.


National : 8 రాష్ట్రాలు.. 49 స్థానాలు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 20 , 2024 | 07:30 PM