Delhi : డిప్యూటీ స్పీకర్ బరిలో అవధేశ్ ప్రసాద్!
ABN , Publish Date - Jul 01 , 2024 | 03:09 AM
లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సమాజ్‌వాదీపార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.
అభ్యర్థిగా నిలపాలని విపక్ష కూటమి యోచన
న్యూఢిల్లీ, జూన్ 30: లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సమాజ్‌వాదీపార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తృణమూల్, ఎస్పీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యూపీకి చెందిన అవధేశ్ ప్రసాద్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మీద తొలిసారిగా ఎంపీగా విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఫైజాబాద్ నియోజకవర్గం జనరల్‌సీటు అయినప్పటికీ దళిత సామాజికవర్గానికి చెందిన అవధేశ్ ప్రసాద్ అక్కడి నుంచి విజయం సాధించటం విశేషం. ఎన్నికల్లో బీజేపీ హిందుత్వ అజెండా ఓడిపోయిందనటానికి అవధేశ్ గెలుపు ఓ నిదర్శమని, జనరల్ స్థానం నుంచి ఆయన గెలవటం దేశ రాజకీయాల్లో ఓ ముఖ్యమైన పరిణామమని ఇండియా కూటమికి చెందిన ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవలి 17వ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ లేకుండానే ముగిసింది. ఈసారి కూడా ఎన్డీయే సర్కారు ఈ పదవిని ఖాళీగానే ఉంచుతుందా? లేక, ఆ పదవి భర్తీకి చర్యలు తీసుకుంటుందా అన్నదానిపై స్పష్టత లేదు. జూలై 3వ తేదీతో పార్లమెంటు తొలి దశ సమావేశాలు ముగుస్తాయి. ఆలోపు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్‌కు లేఖ రాయాలని ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం. కాగా, సోమవారం పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.