Share News

ISRO : పుష్పక్‌ హ్యాట్రిక్‌

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:36 AM

అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది.

ISRO : పుష్పక్‌ హ్యాట్రిక్‌

  • పునర్వినియోగ రాకెట్‌ పరీక్ష సక్సెస్‌

  • ఎల్‌ఈఎక్స్‌ సిరీస్‌లో ఇస్రో 3వ విజయం

  • సురక్షితంగా ల్యాండైన ఆర్‌ఎల్‌వీ

బెంగళూరు (ఆంధ్రజ్యోతి), సూళ్లూరుపేట, జూన్‌ 23: అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది. దీనికోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన రీయూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌ (ఆర్‌ఎల్‌వీ)కు ఇప్పటికే రెండుసార్లు ల్యాండింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ఎల్‌ఈఎక్స్‌) పూర్తిచేసిన ఇస్రో.. ఈసారి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దీన్ని విజయవంతంగా పరీక్షించింది. విమానం రెక్కల తరహాలో రూపొందించిన ఈ పునర్వినియోగ రాకెట్‌ (ఆర్‌ఎల్‌వీ)కు ఇస్రో ‘పుష్పక్‌’ అని పేరు పెట్టింది. ల్యాండింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా చివరిదైన మూడో పరీక్షఎల్‌ఈఎక్స్‌-03ను కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలోని ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఆదివారం ఉదయం 7.10 గంటలకు నిర్వహించినట్టు ఇస్రో ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడించింది.

గతంలో నిర్వహించిన ఎల్‌ఈఎక్స్‌-01, ఎల్‌ఈఎక్స్‌-02 విజయవంతమైన నేపథ్యంలో ఈసారి మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో నిర్వహించినట్టు పేర్కొంది. ప్రయోగంలో భాగంగా పుష్పక్‌ను భారత వాయుసేనకు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ ద్వారా రన్‌వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. అక్కడి నుంచి పుష్పక్‌ స్వయంగా క్రాస్‌ రేంజ్‌ కరెక్షన్‌ విన్యాసాలను చేపడుతూ.. రన్‌వేపైకి చేరుకుని నిర్దేశిత సెంటర్‌లైన్‌ వద్ద ల్యాండ్‌ అయింది.


పుష్పక్‌ రన్‌వేపై ల్యాండయిన తర్వాత బ్రేక్‌ పారాచూట్‌ సాయంతో దాని వేగాన్ని గంటకు 100 కి.మీ.కు తగ్గించామని, ఆ తర్వాత ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్‌లను ఉపయోగించి దాన్ని రన్‌వేపై నిలిపివేశామని పేర్కొంది. అంతరిక్షం నుంచి తిరిగొచ్చే సమయంలో ఆర్‌ఎల్‌వీ విధానం ఎలా ఉంటుంది, హైస్పీడ్‌ ల్యాండింగ్‌ను అది ఎలా నియంత్రించగలుగుతుంది వంటి పరిస్థితులను ఈ మిషన్‌ విజయవంతంగా ప్రదర్శించిందని ఇస్రో వివరించింది.

విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎ్‌సఎ్‌ససీ) నేతృత్వంలో సాగిన ఈ మిషన్‌ను ఇస్రో కేంద్రాలైన స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ), ఇస్రో టెలిమెట్రి, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌), శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ల నుంచి శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. ఎంతో సంక్లిష్టమైన ఈ పరీక్షను విజయవంతం చేసిన బృందాన్ని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ అభినందించారు.

Updated Date - Jun 24 , 2024 | 04:36 AM