Cash For Jobs Scam: మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా.. ఎందుకంటే..?
ABN , Publish Date - Feb 13 , 2024 | 08:35 AM
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ తన పదవీకి సోమవారం నాడు రాజీనామా చేశారు. ఉద్యోగాల కుంభకోణంలో (క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్) సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత ఏడాది జూన్ 14వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ రాకపోవడంతో పదవికి రాజీనామా చేశారు.
చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji) తన పదవికి సోమవారం నాడు రాజీనామా చేశారు. ఉద్యోగాల కుంభకోణంలో (Cash For Jobs Scam) సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత ఏడాది జూన్ 14వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ ఇవ్వాలని కోర్టును పలుమార్లు అభ్యర్థించారు. బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీంతో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇలా వెలుగులోకి..
అన్నాడీఎంకే హయాంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రవాణా శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. రవాణా శాఖలోని కొందరు ఉద్యోగులపై ఎస్ దేవ సహాయం అనే వ్యక్తి చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కి ఫిర్యాదు చేశారు. అతని వెనక మంత్రి ఉన్నారని ఆరోపించారు. అలా క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై తీవ్ర దుమారం చెలరేగడంతో 2015లో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగించింది.
డీఎంకేలో చేరిక, మరోసారి మంత్రి పదవి
ఆ తర్వాత తమిళనాడు రాజకీయ పరిణామాలు మారాయి. దీంతో సెంథిల్ బాలాజీ డీఎంకేలో చేరారు. మరోసారి మంత్రి పదవీ చేపట్టే అవకాశం లభించింది. క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు గత ఏడాది జూన్‌లో బాలాజీని అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీలో ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత జైలుకు తరలించారు. బెయిల్ ఇవ్వాలని పలుమార్లు బాలాజీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.