Share News

Bengaluru: స్థానిక కోటాపై వెనక్కి!

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:39 AM

కర్ణాటకలోని ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నిర్ణయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, దిగ్గజ టెక్‌ సంస్థల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది.

Bengaluru: స్థానిక కోటాపై  వెనక్కి!

  • కన్నడిగులకు రిజర్వేషన్లపై భారీ రగడ

  • కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం

  • ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణుల ఆందోళన

  • రాజ్యాంగ వ్యతిరేక బిల్లు: పాయ్‌ ఐటీ కంపెనీలను

  • బెదిరించేలా ఉంది: అసోచామ్‌

  • కంపెనీలు తరలివెళ్లే ముప్పు: నాస్కామ్‌

  • నిపుణులతో చర్చిస్తాం: మంత్రి పాటిల్‌

  • బిల్లుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా.. సీఎం సిద్దరామయ్య ట్వీట్‌

బెంగళూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నిర్ణయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, దిగ్గజ టెక్‌ సంస్థల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్‌లో చేసిన తీర్మానాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని సీఎం సిద్దరామయ్య బుధవారం రాత్రి ప్రకటించారు. ఈ అంశంపై తీవ్ర వివాదాలు తలెత్తడంతో బిల్లును వాయిదా వేస్తున్నామని సీఎం బుధవారం రాత్రి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ప్రైవేట్‌ సంస్థలు, పరిశ్రమల్లో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కేబినెట్‌ తీర్మాన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


రానున్న మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్‌ ఉద్యోగాల్లో 75ు స్థానికులకే ఇవ్వాలని, మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాల్లోనూ 50ు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ సోమవారం తీర్మానించింది. గురువారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని భావించింది. అయితే ఈ నిర్ణయంపై పారిశ్రామిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ పరిశ్రమల్లో సీ, డీ గ్రూప్‌ ఉద్యోగాలు వందశాతం కన్నడిగులకే తప్పనిసరి చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందంటూ ‘ఎక్స్‌‘లో పోస్టు చేసిన సీఎం సిద్దరామయ్య, కాసేపటికే దాన్ని డిలీట్‌ చేశారు. కన్నడిగులు ఉద్యోగాలకు దూరం కాకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని, తమది కన్నడ అనుకూల పాలన అని ఆ పోస్టులో పేర్కొన్నారు. కన్నడిగుల సంక్షేమానికే ప్రాధాన్యం అంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసి.. ఆ తరువాత దాన్ని తొలగించారు.


బోర్డులో ప్రభుత్వ అధికారులంటారా

ప్రైవేట్‌ సంస్థల్లో కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించేలా కేబినెట్‌లో తీర్మానించిన బిల్లును మార్చాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎ్‌ఫవో మోహన్‌దా్‌స పాయ్‌ అన్నారు. ఇదో నియంతృత్వమైన బిల్లు అని, రాజ్యాంగ వ్యతిరేకమైదని అభిప్రాయపడ్డారు. ‘ప్రైవేట్‌ కంపెనీల్లో నియామకాల బోర్డులో ప్రభుత్వ అధికారులు వచ్చి కూర్చుంటారా..? ఇంటర్వ్యూ వేళ అభ్యర్థుల భాషను పరీక్షించి నియమించుకోవాలా? ఇటువంటి బిల్లు ముందుకు రావడం అసాధ్యం’ అని ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని బయోకాన్‌ చైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌షా తప్పుబట్టారు. ఐటీబీటీ సంస్థలకు నిపుణులు అవసరమని, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనడం టెక్‌ సంస్థలకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో కర్ణాటక ముందంజలో ఉందని, దాన్ని ప్రభావితం చేసే బిల్లును అనుమతించకూడని సూచించారు. ప్రభుత్వ నిర్ణయం బెంగళూరులోని ఐటీ, గ్లోబల్‌ కంపెనీలకు నష్టం కలిగిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, అసోచామ్‌ కర్ణాటక కో-చైర్మన్‌ ఆర్‌కే మిశ్రా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మేధావితనం చూపుతోందని, ఏ మాత్రం ముందుచూపు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలను, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్స్‌ను బెదిరించేలా ఉందని ఆరోపించారు.


పునరాలోచన చేయాలి: నాస్కామ్‌

రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పురోగతికి ఇటువంటి బిల్లులు అడ్డంకిగా మారతాయని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) అభిప్రాయపడింది. ఇలాంటి నిర్ణయాలు ఉద్యోగులపైనా ప్రభావం చూపుతాయని, కర్ణాటకకు ఉండే గ్లోబల్‌ బ్రాండ్‌కు ఎదురుదెబ్బ తగులుతుందని పేర్కొంది. అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న సమయంలో ఇలంటి నిబంధలతో అవి వెనక్కి పోయే ప్రమాదం ఉందని, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇటువంటి ఆంక్షలతో నిపుణులైన అభ్యర్థులకు కొరత ఏర్పడి, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై చర్చించడానికి రాష్ట్ర అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది.


నైపుణ్యం లేని కన్నడిగులకు శిక్షణ: పాటిల్‌

ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్‌ అంశం దుమారం రేపడంతో భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ బెంగళూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల్లో కన్నడిగులకు కొన్ని కేటగిరీల ఉద్యోగాలు కల్పించినా, పారిశ్రామికవేత్తల ఆశయాలకు భంగం కలగకుండా చర్యలు ఉంటాయని చెప్పారు. దీనిపై సీఎంతోపాటు పలువురు నిపుణులతో చర్చిస్తామని పేర్కొన్నారు. నైపుణ్యం లేని కన్నడిగులకు శిక్షణలు ఇచ్చి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి చట్టం తెస్తామని కార్మికమంత్రి సంతో్‌షలాడ్‌ పేర్కొన్నారు. కాగా, బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని ఐటీబీటీ శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే వెల్లడించారు. ఇదిలాఉండగా, కన్నడిగులకు రిజర్వేషన్ల నిర్ణయంపై కర్ణాటక రక్షణ వేదిక (కరవే) వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణ గౌడ హర్షం వ్యక్తం చేశారు.


ఐటీ ఉద్యోగాల్లో జోక్యం ఉండదు: శివకుమార్‌

కర్ణాటకలో పరిశ్రమలు, ప్రైవేట్‌ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పారిశ్రామిక నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించడంతో డీసీఎం డీకే శివకుమార్‌ స్పందించారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఐటీ ఉద్యోగాల విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వాలో వారు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరారు.

Updated Date - Jul 18 , 2024 | 04:39 AM