Maharashtra: శివసేన (యూబీటీ)పై పోలీసులు దర్యాప్తు.. ఆ రూ.50 కోట్లు ఏం చేశారు..?
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:43 PM
శివసేన (యూబీటీ)పై ముంబై ఆర్థిక నేరాల పోలీస్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. శివసేన పార్టీ షిండే వర్గానిది అని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ప్రకటన చేసిన తర్వాత పార్టీ నుంచి రూ.50 కోట్ల నిధులను ఉద్దవ్ థాకరే వర్గం విత్ డ్రా చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై: శివసేన (యూబీటీ)పై ముంబై ఆర్థిక నేరాల పోలీస్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. శివసేన (Shivasena) పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందుతుందని ఎన్నికల సంఘం (EC) గత ఏడాది స్పష్టం చేసింది. ఈసీ స్పష్టం చేసినప్పటికీ పార్టీ నుంచి రూ.50 కోట్ల నిధులను ఉద్దవ్ థాకరేకు చెందిన శివసేన (యూబీటీ) విత్ డ్రా చేసింది. ఇదే అంశంపై పోలీసులకు షిండే వర్గం ఫిర్యాదు చేసింది. దాంతో ముంబై ఆర్థిక నేరాల పోలీస్ విభాగం రంగంలోకి దిగింది.
శివసేన యూబీటీ పార్టీకి చెందిన ప్యాన్, టాన్ వివరాలతో టీడీఎస్, ఇన్ కం టాక్స్ రిటర్స్న్ ఫైల్ చేసిందని షిండే వర్గం ఆరోపిస్తోంది. కొద్దిరోజుల క్రితం ముంబై పోలీస్ కమిషనర్ వివేక్‌కు షిండే వర్గం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై ఆర్థిక నేరాల విభాగం ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాసింది. శివసేన యూబీటీ నుంచి ఆదాయపు పన్ను ఎవరు చెల్లించారని ఆ లేఖలో కోరింది. నిజమైన శివసేనగా షిండే వర్గాన్ని ఎన్నికల సంఘం 2023 ఫిబ్రవరి 17వ తేదీన గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిధులు విత్ డ్రా చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.