Odisha polls 2024: మార్పు దిశగా ఒడిసా!
ABN , Publish Date - May 10 , 2024 | 03:19 AM
ఒడిసా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? పాతికేళ్ల నవీన్ పట్నాయక్ పాలనను మార్చాలని చూస్తున్నారా? ఇదే అదునుగా బీజేపీ పుంజుకుని, విజయం దక్కించుకునేందుకు తహతహలాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.
పట్నాయక్‌కు రాజకీయ పరీక్ష.. నవీన్ ఇమేజ్ బీజేడీని కాపాడేనా?.. పాతికేళ్ల వ్యతిరేకత అధిగమించేనా?
విజయం కోసం బీజేపీ తహతహ
లోక్‌సభ స్థానాలపై పట్టు బిగింపు
2019లో 8 నుంచి ఇప్పుడు 16కు ప్లాన్
అధికారం కోసమూ పక్కా వ్యూహం
కేడర్ లేక వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ
13 నుంచి మూడు దశల్లో పోలింగ్
న్యూఢిల్లీ, మే 9: ఒడిసా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? పాతికేళ్ల నవీన్ పట్నాయక్ పాలనను మార్చాలని చూస్తున్నారా? ఇదే అదునుగా బీజేపీ పుంజుకుని, విజయం దక్కించుకునేందుకు తహతహలాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. అయితే, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇమేజ్ కొంత వరకు అధికార పార్టీ బిజు జనతా దళ్(బీజేడీ)కి దన్నుగా నిలుస్తుందని.. అధికార పీఠాన్ని మరోసారి అందించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. నవీన్ మంచితనం, పారదర్శక పాలన వంటివి ఆయనను కాపాడే అవకాశం ఉందని అంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఒడిసా అసెంబ్లీ ఎన్నికలు నవీన్ పట్నాయక్‌కు రాజకీయ పరీక్ష పెడుతున్నాయని చెబుతున్నారు. ఒడిసాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న ప్రారంభమై జూన్ 1 వరకు మొత్తం మూడు దశల్లో జరగనున్నాయి. దీంతో ప్రధాన ప్రతిపక్షాలకు మరింత అవకాశం చిక్కినట్టయిందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక, విపక్షాలు చేస్తున్న ఎన్నికల ప్రచారాలకు భారీ ఎత్తున ప్రజలు పోటెత్తుతున్నారు. ఈ నెల 6న ప్రధాని మోదీ బెర్హంపూర్, నబరంగపూర్‌లో నిర్వహించిన సభకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఒకవైపు వడగాడ్పులు, తీవ్రమైన ఎండ కొనసాగుతున్నా లెక్కచేయకుండా మోదీ సభకు హాజరు కావడం గమనార్హం. అదేవిధంగా ఏప్రిల్ 28న కేంద్రపారాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహించిన సభకు కూడా ప్రజలు వేలాదిగా హాజరయ్యారు. 42 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా లెక్కచేయకుండా ఈ సభకు రావడం విశేషం. ఈ పరిణామాలను గమనిస్తే సుదీర్ఘ బీజేడీ పాలనను మార్చాలన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, సీఎం నవీన్ పట్నాయక్ ఇమేజ్ బీజేడీకి కలిసి వస్తుందని, ప్రభుత్వ వ్యతిరేకతను అడ్డుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా.. సీఎం నవీన్‌పై మాత్రం కాదని అంటున్నారు.
జూన్ 4తో సరి: మోదీ
ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘జూన్ 4.. బీజేడీ ప్రభుత్వానికి ఎక్స్‌పెయిరీ డేట్. ఆ రోజుతో ఆ పార్టీ ప్రభుత్వం సరి’’ అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అంచనా ప్రకారం ఒడిసాలోని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ భారీ ఎత్తున పుంజుకుంటుందని చెబుతున్నారు.
విసిగిపోయాం: జనం
క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు సర్వేల్లో ప్రజలు బీజేడీ సర్కారుతో విసిగిపోయామని చెబుతున్నారు. ఈ దఫా తాము బీజేపీకి వేటేయాలని నిర్ణయించుకున్నామని చెబుతుండడం గమనార్హం. ఇక్కడ బీజేపీ కంటే కూడా.. ప్రధాని మోదీ ఇమేజ్ ఎక్కువగా పనిచేస్తుండడం గమనార్హం. టీకొట్లు, బడ్డీ కొట్లు ఇలా జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం తీసుకున్నప్పుడు మెజారిటీ అభిప్రాయం బీజేడీకి వ్యతిరేకంగానే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడి వారు.. బీజేడీకి వ్యతిరేకంగా ఓటేస్తామని చెబుతున్నారు.
ముఖ్యంగా పేదలు, గిరిజనులు మార్పు కోరుకుంటున్నారు. దీంతో వీరి సంప్రదాయ ఓట్లు ఈసారి బీజేడీ నుంచి బీజేపీకి మారే అవకాశం కనిపిస్తోంది. అయితే.. కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోరులో ఓటు ఎటు పడుతుందనేది ఆసక్తిగా మారింది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఓటర్లను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. ఇక, రాజధాని భువనేశ్వర్ వంటి కీలక నగరాల్లో ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీ అద్భుతాలు ఏమీ చేయలేదని అంటున్నా.. ఈసారి మార్పు కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామం బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
పోల్ మేనేజ్‌మెంట్‌లో బీజేడీ దూకుడు
పాతికేళ్లుగా అధికారంలో ఉండడంతో బీజేడీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు, పార్టీని ముందుకు నడిపించే నేతలు, పోల్ మేనేజ్‌మెంట్ చేసేవారు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇదే సమయంలో కాంగ్రె్‌సకు బలమైన కేడర్ లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో వెనుకబడింది. బీజేపీ విషయాన్ని గమనిస్తే గత పదేళ్లుగా ఒడిసాపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
కార్యకర్తలను పెంచుకోవడం, నాయకులను ప్రోత్సహించడంలో ముందుంది. ఫలితంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిసాలోని 21 స్థానాలకుగాను ఏకంగా 8 చోట్ల బీజేపీ విజయం నమోదుచేసింది. కాంగ్రెస్ ఒకస్థానానికే పరిమితం కాగా అధికార బీజేడీ 12 స్థానాలు దక్కించుకుంది. ఈ పరిణామం ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి మరింత కలిసివస్తోందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో 8 చోట్ల గెలిచిన కమలనాథులు తాజా ఎన్నికల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అసెంబ్లీ సీట్లపై కూడా..
ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పుంజుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. 2019 ఎన్నికల్లో నవీన్ నేతృత్వంలోని అధికార పార్టీ బీజేడీ 147 స్థానాలకు గాను 112 చోట్ల విజయం దక్కించుకుంది. ఇక, బీజేపీ 2014లో గెలుచుకున్న 13 స్థానాలను కాపాడుకుంటూ మరో 10 స్థానాల్లో పుంజుకుంది. మొత్తంగా 23 చోట్ల విజయం దక్కించుకున్న ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడం గమనార్హం.