Share News

కశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా!

ABN , Publish Date - Oct 09 , 2024 | 03:38 AM

సరిగ్గా ఆరు నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన ఆయన.. ఆ దెబ్బ నుంచి కోలుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు. పోటీ చేసిన రెండుచోట్లా గెలిచి.. పదేళ్ల విరామం తర్వాత సీఎం పదవిని చేపట్టనున్నారు.

కశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా!

  • నాడు లద్దాఖ్‌తో కూడిన రాష్ట్రానికి.. నేడు కశ్మీర్‌కు

  • దాదాపు పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠంపైకి..!

  • లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా అసెంబ్లీలో విజయం

శ్రీనగర్‌, అక్టోబరు 8: సరిగ్గా ఆరు నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన ఆయన.. ఆ దెబ్బ నుంచి కోలుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు. పోటీ చేసిన రెండుచోట్లా గెలిచి.. పదేళ్ల విరామం తర్వాత సీఎం పదవిని చేపట్టనున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరిగిన జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ తొలి ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ)-కాంగ్రెస్‌ కూటమిని విజయపథంలో నడిపించిన ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రి కానున్నారు. ఒమర్‌ 2009-15 మధ్యన ఉమ్మడి జమ్మూకశ్మీర్‌కు సీఎంగా వ్యవహరించారు. ఈయన తాత షేక్‌ అబ్దుల్లా, తండ్రి ఫరూక్‌ అబ్దుల్లాలు చెరో మూడుసార్లు ముఖ్యమంత్రులుగా పనిచేయడం గమనార్హం.

Untitled-3 copy.jpg

  • 28 ఏళ్లకు ఎంపీ.. 39వ ఏట సీఎం

ఒమర్‌ 1970 మార్చి 10న బ్రిటన్‌లో జన్మించారు. ఇంగ్లిష్‌ మహిళ మొలీని వివాహం చేసుకున్న ఫరూఖ్‌ ఇంగ్లండ్‌లోనే ఉండేవారు. తండ్రి షేక్‌ అబ్దుల్లా మరణం అనంతరం ఆయన భారత్‌కు తిరిగొచ్చారు. కాగా, ఒమర్‌.. శ్రీనగర్‌, ముంబైలలో చదివారు. స్కాంట్లాడ్‌లో డిగ్రీ చేశారు. 1998లో 28 ఏళ్ల వయసులో శ్రీనగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 39వ ఏట.. 2009 ఎన్నికల్లో విజయంతో సీఎం అయ్యారు. 1994లో పాయల్‌ నాథ్‌ను వివాహమాడిన ఒమర్‌ 2011లో విడిపోయారు. ఇక 2009లోనూ కాంగ్రె్‌సతో కూడిన ఎన్సీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ఒమర్‌ ఇప్పుడు కాంగ్రె్‌సతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో ఒమర్‌ 2001 నుంచి ఏడాదిన్నర పాటు విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. కుమారుడు ఒమర్‌ అబ్దుల్లానే కశ్మీర్‌ కాబోయే సీఎం అని ఫరూఖ్‌ అబ్దుల్లా మీడియాతో వ్యాఖ్యానించారు.

  • ఒమర్‌.. బుద్గాంలో పీడీపీ అభ్యర్థి సయ్యద్‌ ముంతజీర్‌ మెహ్దీపై 18,485 ఓట్ల ఆధిక్యంతో, గందేర్బల్‌లో బషీర్‌ అహ్మద్‌ మిర్‌పై 10,574 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Updated Date - Oct 09 , 2024 | 03:38 AM