Share News

Indian Cyber ​​Crime : డార్క్‌వెబ్‌లో.. యూజీసీ-నెట్‌ ప్రశ్నపత్రాలు

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:33 AM

యూజీసీ-నెట్‌ ప్రశ్నపత్రం లీకైనట్లు తేలిపోయింది. దేశవ్యాప్తంగా మంగళవారం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగ్గా..సోమవారమే ప్రశ్నపత్రాలు డార్క్‌వెబ్‌లో అందుబాటులోకి వచ్చాయి.

 Indian Cyber ​​Crime : డార్క్‌వెబ్‌లో.. యూజీసీ-నెట్‌ ప్రశ్నపత్రాలు

  • ఒక్కో పేపర్‌కు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల ధర

  • టెలిగ్రామ్‌లోనూ ప్రశ్నల చక్కర్లు అందుకే రద్దు: ధర్మేంద్ర ప్రధాన్‌

  • సీబీఐతో దర్యాప్తు చేయిస్తున్నాం కేంద్ర విద్యాశాఖ అధికారి

న్యూఢిల్లీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): యూజీసీ-నెట్‌ ప్రశ్నపత్రం లీకైనట్లు తేలిపోయింది. దేశవ్యాప్తంగా మంగళవారం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగ్గా..సోమవారమే ప్రశ్నపత్రాలు డార్క్‌వెబ్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో ప్రశ్నపత్రానికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ధర నిర్ణయించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సైబర్‌ క్రైమ్‌ హెచ్చరికల విశ్లేషణ యూనిట్‌-ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) ఈ విషయాన్ని గుర్తించింది.

మంగళవారం యూజీసీ-నెట్‌ పరీక్ష ముగిశాక రెండు షిఫ్టుల ప్రశ్నపత్రాలు, డార్క్‌వెబ్‌లో సంపాదించిన క్వశ్చన్‌ పేపర్లతో పోల్చిచూశాక అవన్నీ సరిపోలడంతో బుధవారం కేంద్ర విద్యాశాఖకు సమాచారం అందజేసింది. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ విషయాలను నిర్ధారించారు. ‘‘బుధవారం మధ్యాహ్నం 3గంటలకు మాకు ఈ సమాచారం అందింది. వెంటనే యూజీసీ చైర్మన్‌తో మాట్లాడాను. డార్క్‌వెబ్‌లో ముందురోజే అందుబాటులోకి వచ్చిన ప్రశ్నపత్రాలు, టెలిగ్రామ్‌లో చక్కర్లు కొట్టిన ప్రశ్నలు యూజీసీ-నెట్‌ పరీక్ష పేపర్‌తో సరిపోలాయి’’ అని అన్నారు. అయితే గురువారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్‌ జైస్వాల్‌ లీకేజీ వ్యవహారమేమీలేదన్నారు. యూజీసీ-నెట్‌ పరీక్షపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు.


యూజీసీ-నెట్‌ పరీక్ష విశ్వసనీయతకు భంగం వాటిల్లిందని ఐ4సీ అనుమానాలను వ్యక్తం చేయడంతో ఆ సమాచారాన్ని సుమోటోగా తీసుకుని, పరీక్షను రద్దు చేశామన్నారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపారు. కాగా జూన్‌ సెషన్‌ యూజీసీ-నెట్‌కు దేశవ్యాప్తంగా 11లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మంగళవారం రెండు షిఫ్టుల్లో జరిగిన పరీక్షలకు 9లక్షల మంది హాజరయ్యారు. మరోవైపు నెట్‌ రద్దు, నీట్‌ పేపర్‌ లీకేజీ ఆరోపణలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. గురువారం ఉదయం సెంట్రల్‌ ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో పాల్గొన్న ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఏ, డీఎ్‌సఎఫ్‌, కేవైఎస్‌, ఎన్‌ఎ్‌సయూఐ సంఘాలకు చెందిన 50 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

నీట్‌ లీకేజీ, నెట్‌ రద్దుపై ఆరెస్సెస్‌ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ),జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కాగా నెట్‌ లీకేజీ ఉదంతంపై గురువారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Jun 21 , 2024 | 04:33 AM