Share News

Pratyekam : క్యాబేజీ తిని 14 ఏళ్ల అమ్మాయి మృతి.. చలికాలంలో ఈ 5 కూరగాయలు విషం!

ABN , Publish Date - Dec 29 , 2024 | 08:09 PM

రాజస్థాన్‌లో ఘోరం.. క్యాబేజీ తిని ప్రాణాలు పోగొట్టుకున్న 14 ఏళ్ల అమ్మాయి.. చలికాలంలో ఈ 5 కూరగాయలు తింటే ప్రాణాలకే ప్రమాదం.

Pratyekam : క్యాబేజీ తిని 14 ఏళ్ల అమ్మాయి మృతి.. చలికాలంలో ఈ 5 కూరగాయలు విషం!
14 Year Girl Died in Rajasthan After Eating Cabbage

సాయంత్రం అవగానే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల దగ్గర వాలిపోవడం చాలామందికి అలవాటు. గోబీ మంచూరియా, న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. రెస్టారెంట్ల నుంచి వీధుల్లో తయారుచేసే వారి వరకూ ఎవరైనా ఈ ఐటమ్స్‌లో పచ్చి క్యాబేజీ తురుమును తప్పకుండా వాడుతుంటారు. సాధారణంగా ఆకుకూర జాతికి చెందిన క్యాబేజీ ఆరోగ్యానికి మంచిదే అయినా చలికాలంలో మాత్రం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే, ఈ కాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల నిల్వ ఉంచిన క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయాల్లో పురుగులు ఎక్కువగా చేరుతుంటాయి. దానికి తోడు పురుగుల మందులతో పండించిన కూరగాయలను కావడంతో.. వాటిని చలికాలంలో తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. అందుకు రాజస్థాన్‌లో క్యాబేజీ తిని ప్రాణాలు పోగొట్టుకున్న 14 ఏళ్ల అమ్మాయి ఉదంతమే నిదర్శనం.


నిజానికి ఆకుకూరలను ఆరోగ్యానికి అమృతంలా భావిస్తారు. కానీ క్రిమికీటకాల నుంచి కాపాడేందుకు పిచికారీ చేసే క్రిమిసంహారక మందులు వాటిని ప్రాణాలు తీసే విషంలా మారుతుస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలో వెలుగు చూసిన 14 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటనే నిదర్శనం. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆ అమ్మాయి వాళ్ల పొలంలో పండించిన క్యాబేజీ ఆకులను తుంచుకుని తింది. అంతకుముందే వాటిపై పురుగుల పిచికారీ చేయడంతో విషపూరితమైన క్యాబేజీ ఆకులను తిన్నాక ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆస్పత్రిలో చేరింది. డిసెంబరు 18వ తేదీ నుంచి చికిత్స పొందుతూ డిసెంబర్ 24న ప్రాణాలు కోల్పోయింది.


పచ్చికూరగాయాలు తింటే ఆరోగ్యానికి మంచిదని సెలబ్రిటీలు తరచూ చెప్తుంటారు. అదే ఫాలో కావాలని కోరుకునే సామాన్యులకు పురుగుల మందులు వాడకుండా పండించిన కూరగాయలు మార్కెట్లో లభించడం అరుదు. ఇదొక్కటే కాక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలోనూ మనం కోరుకున్నా విషపదార్థాలు కడుపులోకి వెళ్తున్నాయనే అవగాహన అందరికీ ఉండదు. మరి, ఇలా అయితే ఈ పురుగుల మందుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా అని ఆలోచిస్తున్నారా. రాజస్థాన్‌ ఘటన తర్వాత పచ్చి కూరగాయల వినియోగంపై సోషల్ మీడియాలో ఇదే చర్చనీయాంశంగా మారింది.


పురుగుమందుల దుష్ప్రభావాలు:

ఆహారం ద్వారా కొద్ది కొద్దిగా పురుగుల మందులు కడుపులోకి చేరినపుడు వికారం, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అలర్జీలు, దద్దుర్లు ఏర్పడి చర్మంపై దురద, కంటికి చికాకును కలిగిస్తాయి. అంతే కాదు. పురుగులమందుల అవశేషాలు తరచూ శరీరంలోకి చేరుతుంటే ల్యుకేమియా, లింఫోమా సహా అనేక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.


అత్యధిక పురుగుమందులు కలిగిన కూరగాయలు ఇవే:

పురుగులమందుల అవశేషాలతో కలుషితమైన పండ్లు, కూరగాయలపై ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్ (EWG)"డర్టీ డజన్" పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఈ కింది కూరగాయల సాగుకే ఎక్కువగా పురుగుల మందులు వాడుతున్నట్లు తేల్చింది.


పాలకూర

పాలకూరపై పిచికారీ చేసే పురుగుమందులలో ఆర్గానోఫాస్ఫేట్లు ఉంటాయి. ఇలా పండించిన పాలకూరను తినటం వల్ల కాలక్రమేణా నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

కాలే

ఆకుపచ్చని రంగులో కాలీఫ్లవర్ రకానికి చెందిన కాలేలో అధిక పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. ఈ రసాయనాలు దీర్ఘకాలంగా ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతుంటే జీర్ణసమస్యలు తలెత్తి ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

టమాట

టమాటా పంటకు తెగుళ్లు, వ్యాధులు సోకే అవకాశం అధికం. అందుకే క్రిమిసంహారక మందులు ఎక్కువగా చల్లుతుంటారు రైతులు. ఇలాంటి టమాటాలు క్యాన్సర్ కారకాలకు నిలయంగా మారి మన ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయి.


సెలెరీ

చూపుకు కొత్తిమీరలాగే కనిపించే సెలెరీలోనూ పురుగుమందుల అవశేషాలు ఎక్కువ. వీటిని తింటే హార్మోన్ల అసమతుల్యత సహా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కొల్లార్డ్ గ్రీన్స్

పాలకూర, బచ్చలికూర సాగుకు వాడే పురుగుమందులనే కొల్లార్డ్ గ్రీన్స్‌ పంటలో కూడా ఉపయోగిస్తారు. ఇతర ఆకు కూరల మాదిరిగానే కాలర్డ్ గ్రీన్స్‌ తినటం ఆరోగ్యానికి హానికరం.

పురుగులమందులతో పండించినా.. ఇలా తింటే ఏం కాదు..

పురుగుమందులను పండించిన కూరగాయలు తప్ప ఆర్గానిక్ కూరగాయలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. కాబట్టి, కూరగాయలపై ఉండే క్రిమిసంహారకాల దుష్ర్పభావం మీ ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు ఇలా చేయండి. కూరగాయలు నీటితో బాగా కడిగి 15 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టండి. ఇలా చేస్తే పురుగుల మందుల అవశేషాలు తొలగిపోతాయి. అలాగే బాగా ఉడికించి తినటమూ చాలా ముఖ్యం.

Updated Date - Dec 29 , 2024 | 08:09 PM