Police Investigation: హత్యానేరం ఒప్పుకునేందుకు నటుడు దర్శన్ రూ.30 లక్షల డీల్
ABN , Publish Date - Jun 14 , 2024 | 04:39 AM
నటుడు దర్శన్‌పై నమోదైన హత్యకేసు విచారణలో పలు విషయాలు బహిర్గతమవుతున్నాయి. బహచిత్రదుర్గ నివాసి రేణుకాస్వామిని హత్య చేసి, ఆ నేరాన్ని ఒప్పుకునేందుకు నలుగురు యువకులకు రూ.30లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరినట్లు పోలీసుల విచారణలో తేలింది.
బెంగళూరు, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): నటుడు దర్శన్‌పై నమోదైన హత్యకేసు విచారణలో పలు విషయాలు బహిర్గతమవుతున్నాయి. బహచిత్రదుర్గ నివాసి రేణుకాస్వామిని హత్య చేసి, ఆ నేరాన్ని ఒప్పుకునేందుకు నలుగురు యువకులకు రూ.30లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరినట్లు పోలీసుల విచారణలో తేలింది. దర్శన్‌ను కేసు నుంచి తప్పించేందుకు ఈ వ్యూహం పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
బెంగళూరులో హత్య చేసి, చిక్కమగళూరు జిల్లా చార్మాడిఘాట్‌లోగానీ, తమిళనాడులోని అటవీప్రాంతంలోగానీ మృతదేహాన్ని పడేయాలని కుట్ర పన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు భయపడి బెంగళూరు సుమనహళ్లి సమీపంలోని ఓ కాలువలో పడేశారు. హత్యకేసులో నిందితుల సంఖ్య 17కి చేరింది. ఓ మహిళ సహా నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దర్శన్ అభిమానుల సంఘం చిత్రదుర్గ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర.. నలుగురు యువకులకు రూ.30 లక్షలు చెల్లించి, డీల్ కుదిర్చేందుకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా హత్యకేసులో నటుడు దర్శన్ అరెస్టుకావడంపై జేడీఎస్ యువనేత నిఖిల్ స్పందించారు. చట్టం ముందు అందరూ ఒక్కటేనన్నారు.