UP: యూపీ బీజేపీలో ముసలం సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేపీ మౌర్య మధ్య విభేదాలు
ABN , Publish Date - Jul 18 , 2024 | 04:48 AM
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయాలు సాధించినంతవరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తుంది! కానీ.. ఒక్కసారి ఓటమి ఎదురైతే.. పార్టీల్లో లోపాలు, అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడతాయి.
ప్రభుత్వం కంటే పార్టీ పెద్దదని వ్యాఖ్యానించిన మౌర్య
యోగి తీరుకు నిరసనగా క్యాబినెట్ భేటీలకూ డుమ్మా
ప్రధాని మోదీని కలిసిన యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర
న్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయాలు సాధించినంతవరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తుంది! కానీ.. ఒక్కసారి ఓటమి ఎదురైతే.. పార్టీల్లో లోపాలు, అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడతాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడం.. 33 సీట్లకే పరిమితం కావడంతో యూపీ బీజేపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య మధ్య చాలాకాలంగా ఉన్న విభేదాలు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరింత పెరిగాయి. యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి యోగి పనితీరే కారణమనే విమర్శలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే.. ‘‘ప్రభుత్వం కంటే పార్టీ పెద్దది.
పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదు’’ అని కేపీ మౌర్య చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. ఆయన ఆ వ్యాఖ్యలు యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించే చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. యోగి ఆదిత్యనాథ్ వైఖరికి నిరసనగా ఇటీవలికాలంలో ఆయన క్యాబినెట్ సమావేశాలకు కూడా హాజరు కావట్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఢిల్లీకి చేరుకుని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఆయనొక్కరే కాదు.. యూపీ బీజేపీకి చెందిన పలువురు నేతలు కొద్దిరోజులుగా ఢిల్లీలో తిష్ఠవేసి జాతీయ నాయకత్వాన్ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు.. యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా ఢిల్లీలో నడ్డాను, ప్రధాని మోదీని కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అనుకున్నస్థాయిలో సీట్లు సాధించలేకపోవడానికి బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తాను తప్పుకొంటానని ఆయన మోదీకి చెప్పినట్టు సమాచారం. ఈ విషయం తెలియగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ అంశంతోపాటు.. యూపీలో పార్టీ ప్రక్షాళన, ఇతర కీలక అంశాల గురించి, తదుపరి కార్యాచరణ ప్రణాళిక గురించి వారు చర్చించినట్టు తెలిసింది.
జాట్ సామాజికవర్గానికి చెందిన భూపేంద్రచౌదరి స్థానంలో.. ఒక ఓబీసీ నేతను పార్టీ సారథిగా నియమించి 2027 ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే.. 2017లో పార్టీ రాష్ట్ర సారథిగా అద్భుత విజయాన్ని కట్టబెట్టిన కేపీ మౌర్య ఓబీసీ కావడం, ఆయనకు ఆరెస్సెస్ మద్దతు కూడా బలంగా ఉండడంతో.. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని సరిదిద్దేందుకు ఆయనకు పార్టీలో మంచి పదవి కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం.