PM Modi: రాహుల్‌కు మతి చెడింది..? వారణాసి యువకుల కామెంట్లపై ప్రధాని మోదీ విసుర్లు
ABN , Publish Date - Feb 23 , 2024 | 05:00 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారణాసిలో కొందరు యువకులు మద్యం సేవించి రహదారి మీద పడుకున్నారని రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించారు. ఆ కామెంట్లను ప్రధాని మోదీ ధీటుగా తిప్పి కొట్టారు.
వారణాసి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారణాసిలో (Varanasi) కొందరు యువకులు మద్యం సేవించి రహదారి మీద పడుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ కామెంట్లను ప్రధాని మోదీ ధీటుగా తిప్పి కొట్టారు. వారణాసిలో శుక్రవారం నాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
Congress: మహారాష్ట్రలో ఆ 8 స్థానాలపై కాంగ్రెస్ కూటమిలో విభేదాలు..?
‘వారణాసికి చెందిన యువత తాగి పడుకున్నారా..? అలా మాట్లాడిన వారికి మతి చెడింది. కాంగ్రెస్ యువరాజు తమ సొంత గడ్డకు చెందిన ప్రజలను అవమానించారు. అలా మాట్లాడటం తగదు. గత రెండు దశాబ్దాలుగా మోదీని తిడుతున్నారు. ఇప్పుడు వారి నిరాశ, నిస్పృహను వారణాసి యువతపై చూపిస్తున్నారు అని’ మోదీ మండిపడ్డారు. ఎక్కడ రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేశారు. వారణాసి యువతకు రాహుల్ గాంధీ, ఇండియా కూటమి చేసిన అవమానాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వారణాసి యువత ప్రతిభ చూసి వారు భయ పడుతున్నారని విమర్శించారు. కాశీ, అయోధ్యలో జరిగిన అభివృద్ధి వారికి ఏ మాత్రం ఇష్టం లేదని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కబంధ హస్తల్లో ఉత్తర ప్రదేశ్ చిక్కిందని మండిపడ్డారు. అవినీతితో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉత్తర ప్రదేశ్ నిలిచిందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వడం లేదని మోదీ విరుచుకుపడ్డారు.
కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయాలు చేస్తున్నారని ఇండియా బ్లాక్ నేతలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నత స్థానంలో ఉండటం వారికి ఏ మాత్రం ఇష్టం ఉండదన్నారు. దళిత, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారి పట్ల చిన్న చూపు ఉంటుందని వివరించారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన సమయంలో ఇండియా బ్లాక్ నేతలు ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. కులం పేరుతో వివక్ష చూపితే మానవత్వం ఉండదని అభిప్రాయ పడ్డారు. తమ ప్రభుత్వం దళిత, గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను కూడా వ్యతిరేకిస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క దళిత, గిరిజన సోదరుడు, సోదరి గుర్తుంచుకోవాలని సూచించారు. ఇండియా బ్లాక్ నేతలు కుటుంబ ప్రయోజనాల కోసం రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Congress: మహారాష్ట్రలో ఆ 8 స్థానాలపై కాంగ్రెస్ కూటమిలో విభేదాలు..?