Priyanka Gandhi Vadra: ఆస్పత్రిలో చేరిన ప్రియాంక గాంధీ వాద్రా..ఏమైందంటే
ABN , Publish Date - Feb 16 , 2024 | 04:33 PM
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ సమాచారాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ సమాచారాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ట్వీట్‌లో 'భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకోవడానికి తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. కానీ అనారోగ్యం కారణంగా, ఈరోజే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని యాత్రలో పాల్గొనలేక పోతున్నానని ప్రియాంక గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
తన ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే ఈ ప్రయాణంలో భాగమవుతానని ఆమె వెల్లడించారు. అప్పటి వరకు చందౌలీ-బనారస్ చేరుకునే ప్రయాణికులందరికీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన తన సహోద్యోగులకు, ప్రయాణానికి సిద్ధమవుతున్న సహచరులకు, ప్రియమైన తన సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
అయితే ఈరోజు (శుక్రవారం) ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో జరిగే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో జరగనుంది. ఆపై రాయ్‌బరేలీ, అమేథీ ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. ఫిబ్రవరి 22, 23న యాత్రకు విశ్రాంతి ఇచ్చి ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది.