Share News

Wayanad Landslide: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక

ABN , Publish Date - Aug 01 , 2024 | 07:46 AM

ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ ప్రమాదంలో దాదాపు 160 మందికిపైగా మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం కేరళలోని వయనాడ్‌, ముప్పడిలో పర్యటించనున్నారు.

Wayanad Landslide: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక

తిరువనంతపురం, ఆగస్ట్ 01: ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ ప్రమాదంలో దాదాపు 160 మందికిపైగా మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం కేరళలోని వయనాడ్‌, ముప్పడిలో పర్యటించనున్నారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా బాధితులుగా మారిన కుటుంబాలను వారు పరామర్శించనున్నారు. అలాగే పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో సైతం వారు మాట్లాడనున్నారు. అదే విధంగా వివిధ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారితో రాహుల్, ప్రియాంక భేటీ కానున్నారు.


నిన్న మొన్న వాయిదా.. నేడు పర్యటన..

అసలు అయితే వాయనాడ్‌లో ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించాల్సి ఉంది. కానీ కేరళలో వాతావరణం అంతంగా అనుకూలంగా లేదని.. ఈ కారణంగా వారి వయనాడ్ పర్యటన వాయిదా పడిందని సమాచారం. ఇక వయనాడ్ ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన పలు దఫాలుగా సమావేశాలను నిర్వహించారు.


కేంద్ర హోం మంత్రి ప్రకటన.. ఖండించిన కేరళ సీఎం

మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల సూచించామని లోక్‌సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం స్పష్టం చేశారు. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం తమ సూచనలను పట్టించుకోలేదన్నారు. హోం మంత్రి అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. అలాంటి సూచనలు ఏవి కేంద్రం తమకు చేయలేదన్నారు. అయినా ఇటువంటి వ్యాఖ్యలకు ఇది సమయం కాదని సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.


ఇప్పటికే స్పందించిన ప్రధాని, పలు రాష్ట్రాల సీఎంలు...

ఇంకోవైపు.. కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు పాల్గొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ విపత్తుపై ప్రధాని మోదీ స్పందించారు. కేరళ సీఎంతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఈ సందర్భంగా సీఎంకు మోదీ హామీ ఇచ్చారు. అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం.. మేము సైతం అంటు ముందుకొచ్చాయి. ఆ క్రమంలో కేరళ ప్రభుత్వానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి.


వయనాడ్‌కు రాహుల్, ప్రియాంక... ఎందుకంటే...

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండో సారి రాహుల్ గాంధీ.. వయనాడ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. అలాగే రాయ్‌బరేలీ నుంచి కూడా ఆయన విజయం సాధించారు. దీంతో వయనాడ్‌ ఎంపీ పదవికి రాహుల్ రాజీనామా చేశారు. అనంతరం కష్ట కాలంలో తనకు అండగా ఉన్నారంటూ.. వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. అదీకాక మరికొద్ది రోజుల్లో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగునుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగనున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 07:46 AM