Rahul Gandhi : విధానాల రూపకల్పనకు కులగణనే పునాది
ABN , Publish Date - Aug 25 , 2024 | 03:17 AM
దేశ వ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ జరగాలని విపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి డిమాండ్ చేశారు.
మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేవాళ్ల జాబితాలో దళితులకు చోటేది: రాహుల్
ప్రయాగ్‌రాజ్, ఆగస్టు 24: దేశ వ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ జరగాలని విపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి డిమాండ్ చేశారు. కులగణన అంటే కేవలం ఆయా వర్గాల జనాభా వివరాలను సేకరించడం మాత్రమే కాదని, అంతకుమించి విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి వేసే పునాదిలాంటిదని చెప్పారు.
90% జనాభా ఇంకా దేశంలోని ప్రధాన వ్యవస్థలతో అనుసంధానం కాలేకపోయారని, అలాంటి వారి స్థితిగతులు తెలుసుకోవాలంటే కులగణన జరపాల్సిందేనని చెప్పారు. చాలా మందికి పాలనా యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, మీడియా రంగాల్లో చోటు దక్కడం లేదని అన్నారు. వారికి నైపుణ్యం, విజ్ఞానం ఉన్నా వ్యవస్థల్లో భాగస్వామ్యం కాలేకుండా దూరంగా ఉంటున్నారని, అలాంటి వారి అభివృద్ధి కోసమే కులాల లెక్కలు కావాలని డిమాండు చేస్తున్నామని చెప్పారు.
మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేవారి జాబితాలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీల్లో ఎవ్వరికీ చోటు కల్పించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. శనివారం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో ప్రసంగిస్తూ కులగణన ఆవశ్యకతను రాహుల్ వివరించారు.
‘‘కులాల లెక్కలు లేకుండా వాస్తవ రూప ప్రణాళికలను రూపొందించలేం. విధానాల రూపకల్పనకు రాజ్యాంగం ఓ గైడ్‌గా ఉపయోగపడుతోంది. సామాజిక-ఆర్థిక వివరాలను వెల్లడించే కులగణన రెండో గైడ్‌గా పనికొస్తుంది.
కుల గణన ద్వారా రాజ్యాంగాన్ని కాపాడాలన్నదే మా ప్రయత్నం. రాజ్యాంగాన్ని పేదలు, కూలీలు, గిరిజనులే కాపాడుతున్నారు....(అదానీలు కాదు)...అయితే ఆ 90 శాతం మందికి భాగస్వామ్య హక్కులు లేకపోతే రాజ్యాంగానికి రక్షణ ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.
దేశ ప్రజలు కులగణనకు అనుకూలంగా ఉన్నారని, ప్రధాని దీన్ని అమలు చేయకతప్పదని అన్నారు. ఒకవేళ అమలు చేయకపోతే మరొకరు ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. తర్వాత ఆయన ట్వీట్ చేస్తూ సమాజాన్ని ఎక్స్‌రే తీయడానికి కులగణన ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఏ వర్గాలకు ఎంత భాగస్వామ్యం ఉందన్న డాటాను తెలుసుకోవచ్చని చెప్పారు.