SP: అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు, విచారణకు సహకరిస్తా, కండీషన్స్ అప్లై అంటోన్న అఖిలేష్
ABN , Publish Date - Feb 29 , 2024 | 02:12 PM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలో (2012-2016) జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు జారీచేసింది. ఢిల్లీలో శుక్రవారం నాడు (రేపు) విచారణకు హాజరు కావాలని కోరింది. సీబీఐ సమన్లు జారీచేసిన అంశంపై సమాజ్ వాదీ పార్టీ స్పందించింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఉన్న సమయంలో (2012-2016) జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు జారీచేసింది. ఢిల్లీలో శుక్రవారం నాడు (రేపు) విచారణకు హాజరు కావాలని అందులో కోరింది. సీబీఐ సమన్లు జారీచేసిన అంశంపై సమాజ్ వాదీ పార్టీ (SP) స్పందించింది. ‘సీబీఐ జారీచేసిన సమన్లపై విచారణకు తమ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహకరిస్తారు. ఢిల్లీలో విచారణకు మాత్రం హాజరు కాలేరు. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నారు. సీబీఐ అధికారులు లక్నోలో విచారిస్తే ఏ అభ్యంతరం లేదు. లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన ఫర్లేదు అని’ సమాజ్‌వాదీ పార్టీ స్పష్టం చేసింది.
లక్నోలో (Lucknow) గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం పీడీఏ (పిచ్డా, దళిత్, అల్ప సంఖ్యక్) సమావేశం ఉందని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. శుక్రవారం నాడు అఖిలేష్ యాదవ్ ఢిల్లీ వెళ్లడం వీలు కాదని తేల్చి చెప్పారు. అక్రమ మైనింగ్ కేటాయింపుల వ్యవహారంలో ఆ నాటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు (Akhilesh Yadav) సాక్షిగా సమన్లు జారీ చేశామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. నిందితుడిగా సమన్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.