Share News

Tamil Nadu: ఘోరం.. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన..

ABN , Publish Date - Dec 03 , 2024 | 08:30 AM

ఫెంగల్ తుపాను తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. తుపాను తీరం దాటినప్పటి నుంచీ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది.

Tamil Nadu: ఘోరం.. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన..

చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఫెంగల్ తుపాను కారణంగా సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. దీంతో తిరువణ్ణామలైలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. అయితే తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగిపడడం ఇది రెండోసారి. ఆదివారం కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో దాదాపు 30 మంది చిక్కుకుపోయారు. దీంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు.


ఫెంగల్ తుపాను తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. తుపాను తీరం దాటినప్పటి నుంచీ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది. ముఖ్యంగా తిరువణ్ణామలై, విల్లుపురం, పుదుచ్చేరి వరదలతో భారీగా నష్టపోతున్నాయి. ఇళ్లు, రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. వరదలు ధాటికి వంతెనలన్నీ పూర్తిగా కొట్టుకుపోయాయి. వరదనీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైలు మార్గాలు సైతం దెబ్బతిన్నాయి. మరోవైపు చెన్నైలోని విమానాశ్రయంలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో పలు విమాన సర్వీసులను ఆయా సంస్థలు రద్దు చేశాయి.


పశ్చిమ తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లోనూ రికార్డుస్థాయిలో వరదలు ముంచెత్తాయి. గడచిన 24 గంటల్లో కృష్ణగిరిలోని ఉత్తంగరైలో 50 సెంటీమీటర్లు, విల్లుపురంలో 42 సెంటీమీటర్లు, ధర్మపురిలోని హరూర్‌లో 33 సెంటీమీటర్లు, కడలూరు, తిరువణ్ణామలైలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణగిరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కకుపోయాయి. ఆ క్రమంలో కృష్ణగిరిలోని ఉత్తాన్‌గిరి బస్టాండ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు బస్సులు, చిన్న కారులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


తుపాను కారణంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. అలాగే ఉత్తర కేరళ, దక్షిణ కర్ణాటకకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబరు 3 నాటికి ఉత్తర కేరళ, కర్ణాటక మీదుగా అరేబియా సముద్రానికి ఫెంగల్ తుపాను వెళ్లే క్రమంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి:

Health News: నిద్ర లేవగానే ఈ పనులు చేస్తున్నారా.. అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రణరంగం

Updated Date - Dec 03 , 2024 | 09:06 AM