South India States: దక్షిణాదిన జన ఆందోళన!
ABN , Publish Date - Oct 24 , 2024 | 04:51 AM
దేశంలో జనాభా అపరిమితంగా పెరిగిపోవడంతో 40-50 ఏళ్ల క్రితం దాని నియంత్రణకు కేంద్ర, రాష్ట్రాలు నడుం బిగించాయి. జనాభా నియంత్రణ విధానాలు గట్టిగా అమలు చేశాయి.
జనాభా తగ్గుదలపై ఆంధ్ర, తమిళనాడుల్లో కలవరం
భవిష్యత్‌లో యువత కంటే వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం
నియోజకవర్గాల పునర్విభజన పైనా జనాభా లెక్కల ప్రభావం
ఎక్కువ మంది పిల్లలను కనాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు
తమిళనాడు సీఎందీ అదేమాట
న్యూఢిల్లీ, అక్టోబరు 23: దేశంలో జనాభా అపరిమితంగా పెరిగిపోవడంతో 40-50 ఏళ్ల క్రితం దాని నియంత్రణకు కేంద్ర, రాష్ట్రాలు నడుం బిగించాయి. జనాభా నియంత్రణ విధానాలు గట్టిగా అమలు చేశాయి. ముఖ్యంగా దక్షిణ భారతం ఈ విషయంలో ముందంజలో ఉంది. అయితే భవిష్యత్‌లో ఇదే తమకు ముప్పు తెచ్చిపెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నేతలు ఆందోళన చెందుతున్నారు. వృద్ధుల జనాభా పెరిగిపోతుండగా.. జననాల రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేటు-టీఎ్‌ఫఆర్.. ప్రతి మహిళ తన జీవితకాలంలో కనే పిల్లల సగటు శాతం) తగ్గిపోతోంది. త్వరలోనే జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానుంది. దక్షిణాది జనాభా తగ్గిపోయే అవకాశం ఉందని.. ఇది వనరుల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయా రాష్ట్రాలు అంటున్నాయి. అంతేగాక.. జనాభాను బట్టి జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది వాటా, పలుకుబడి తగ్గిపోతాయన్న ఆందోళన కూడా ఏర్పడింది.
ఇన్నాళ్లూ జనాభా నియంత్రణ పాటిస్తే ప్రభుత్వాలు ప్రోత్సాహకాలిచ్చేవి. ఇప్పుడు ఎక్కువ మందిని కనాలని.. అలా కంటే ప్రోత్సాహకాలిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఇందుకోసం ఓ చట్టం తెచ్చే యోచనలో ఉన్నామని సరిగ్గా ఐదు రోజుల కిందట బహిరంగ సభలో వెల్లడించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఒకడుగు ముందుకేసి.. తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. జాతీయ స్థాయిలో తమిళనాడు రాజకీయ పలుకుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని మూడ్రోజుల కిందట అన్నారు. జనాభా నియంత్రణలో దక్షిణ రాష్ట్రాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ అంశంలో విజయాలు సాధించిన రాష్ట్రాలను నియోజకవర్గాల పునర్విభజన సమయంలో శిక్షించరాదన్నారు.
జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సీట్ల కేటాయింపు జరుగుతుందా అని ప్రశ్నించారు. అలా జరక్కుండా ఓ చక్కటి ఫార్ములాను రూపొందించాలని సూచించారు. 2031 జనాభా లెక్కల తర్వాత చేసే నియోజకవర్గాల పునర్విభజనలో లోక్‌సభ స్థానాలను జనసంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయాల్సి ఉండగా.. 2026లోనే సర్దుబాటు చేయాలని వాజపేయి ప్రభుత్వం 2001లో రాజ్యాంగ సవరణ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాజకీయాల సంగతి అటుంచితే దక్షిణ భారతంలో జననాల రేటు.. భర్తీ స్థాయి కంటే బాగా తగ్గిపోయిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స)-5లో కూడా వెల్లడైంది. వాస్తవానికి ఈ ఏడాది జూలై 27న ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో.. జనాభా నిర్వహణ విధానాలను రాష్ట్రాలు సొంతగా రూపొందించుకోవలసిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్న సమస్యను అధిగమించడానికి చేపట్టే జనాభా నిర్వహణ విధానాలను కేంద్రం ప్రోత్సహిస్తుందని ప్రధాని తన ముగింపు ఉపన్యాపంలో పేర్కొనడం గమనార్హం. జనాభా నియంత్రణలో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధిస్తూ చాలా రాష్ట్రాలు చట్టాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం.. బిహార్, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే భర్తీ స్థాయి (2.1) కంటే టీఎ్‌ఫఆర్ ఎక్కువగా ఉంది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్లలోపు మహిళల్లో టీఎ్‌ఫఆర్ జాతీయ సగటు 1981 జనాభా లెక్కల ప్రకారం 4.5గా ఉండగా.. 1991లో 3.6, 2001లో 2.5, 2011లో 2.2గా ఉందని.. తన సర్వేలో ఇది 2.0 అని ఈ సర్వే వెల్లడించింది.