Supreme Court : పదార్థమేమిటో చెప్పాలి
ABN , Publish Date - Jul 23 , 2024 | 04:49 AM
శ్రావణ మాసంలో జరిగే కావడి యాత్ర సందర్భంగా భక్తులు వెళ్లే మార్గంలో ఉన్న హోటళ్లు, దాబాలు, తోపుడు బండ్ల ఎదుట వాటి యజమానులు సిబ్బంది సహా వ్యక్తిగత వివరాలను ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
శాకాహారమా? మాంసాహారమా? అనేది చూపితే చాలు
‘కావడి’ మార్గంలో హోటళ్లపై పేర్ల ప్రదర్శనపై సుప్రీం
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై స్టే
కేసు తదుపరి విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా
నేను కేరళలో ముస్లిం నడిపే శాకాహార హోటల్‌కు వెళ్లా
అది మంచి ప్రమాణాలతో ఉంది: జస్టిస్ ఎస్వీఎన్ భట్టి
శాకాహారమా? మాంసాహారమా? అనేది చూపితే చాలు
కావడి మార్గంలో పేర్ల ప్రదర్శనపై సుప్రీం కోర్టు
యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై స్టే
న్యూఢిల్లీ, జూలై 22: శ్రావణ మాసంలో జరిగే కావడి యాత్ర సందర్భంగా భక్తులు వెళ్లే మార్గంలో ఉన్న హోటళ్లు, దాబాలు, తోపుడు బండ్ల ఎదుట వాటి యజమానులు సిబ్బంది సహా వ్యక్తిగత వివరాలను ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. హోటళ్ల యజమానులు పేర్లు కాదు.. అందించే ఆహార పదార్థాలు శాకాహారమా? మాంసాహారమా? అనే వివరాలను మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టీఎంసీ ఎంపీ మహువాతో పాటు విద్యావేత్త అపూర్వానంద్, కాలమిస్ట్ ఆకార్ పటేల్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలతో పాటు ఉజ్జయిని మున్సిపాలిటీ కూడా ఇదే తరహా ఆదేశాలు ఇచ్చినందుకు మధ్యప్రదేశ్ సర్కారుకూ నోటీసులు జారీ చేసింది.
కాగా, విచారణ సందర్భంగా మొయిత్రా తరఫు ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. పేర్ల ప్రదర్శనపై ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని ఆరోపించారు. నిబంధనను ఉల్లంఘించినవారికి జరిమానా విధించే అంశాన్ని ప్రస్తావించారు.
వ్యక్తి ఎవరో తెలుసుకుని దూరం పెట్టే ఉద్దేశం ఉందని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. విచారణకు యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు హాజరు కాలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ.. కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
కేరళలో ముస్లిం నడిపే హోటల్‌కు వెళ్లా..
కేసు విచారణ సదర్భంగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను కేరళలో జడ్జిగా ఉన్నప్పుడు ముస్లిం వ్యక్తి నడిపే శాకాహార హోటల్‌కు తరచూ వెళ్లేవాడినని తెలిపారు. అది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండేదన్నారు. కాగా, కావడి యాత్రపై యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాల మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పట్ల అధికార ఎన్డీఏ కూటమిలోని జేడీయూ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ వంటి ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ.. ‘‘రాజధర్మం’’ గురించి వారి సీఎంలకు చెబుతారని తాము ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.