Share News

Supreme Court: ‘సీబీఐ దుర్వినియోగం’ పిటిషన్‌ విచారణార్హమే

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:02 AM

పశ్చిమ బెంగాల్‌ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రానికి వ్యతిరేకంగా బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు అర్హమైందేనని బుధవారం కోర్టు స్పష్టం చేసింది.

Supreme Court: ‘సీబీఐ దుర్వినియోగం’ పిటిషన్‌ విచారణార్హమే

న్యూఢిల్లీ, జూలై 10: పశ్చిమ బెంగాల్‌ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రానికి వ్యతిరేకంగా బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు అర్హమైందేనని బుధవారం కోర్టు స్పష్టం చేసింది. బెంగాల్‌లో సీబీఐ చేపట్టిన కేసుల దర్యాప్తును సవాల్‌ చేసే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. బెంగాల్‌ సర్కారు వ్యతిరేకిస్తున్నప్పటికీ సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపులు, భూకబ్జాలు తదితర కేసులపై సీబీఐ విచారణకు అనుమతినిస్తూ కోల్‌కత్తా హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేకించింది. 2018లోనే రాష్ట్రంలో సీబీఐకి సమ్మతిని ఉపసంహరించుకున్నప్పటికీ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. మే 8న తీర్పు రిజర్వు చేసింది.


‘బెంగాల్‌ పిటిషన్‌ను కొనసాగించడం సరికాదు. సీబీఐ నియంత్రణ మా పరిధిలో లేదు’ అంటూ కేంద్రం చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం (డీఎ్‌సపీఈ) నిబంధనల మేరకు సీబీఐ తమ అధికార పరిధిలో దర్యాప్తు నిర్వహించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. మా దృష్టిలో డీఎ్‌సపీఈ చట్టం మేరకు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సంస్థే సీబీఐ.. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా డీసీపీఈ చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేయొచ్చా లేదా అనే చట్టపరమైన సమస్య ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించాం’ అని వ్యాఖ్యానించింది. విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Jul 11 , 2024 | 05:02 AM