Share News

ED: కేజ్రీవాల్ ఈడీ విచారణపై వీడని సస్పెన్స్

ABN , Publish Date - Feb 02 , 2024 | 07:16 AM

లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. జనవరి 31వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ED: కేజ్రీవాల్ ఈడీ విచారణపై వీడని సస్పెన్స్

ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. జనవరి 31వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. గత నాలుగుసార్లు జారీచేసిన నోటీసులకు వివిధ కారణాలు చెప్పి కేజ్రీవాల్ హాజరుకాలేదు. ఈ రోజు విచారణకు హాజరవుతారా..? లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

కేసు నేపథ్యం ఇదే

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2021 నవంబర్‌లో న్యూ ఎక్సైజ్ పాలసీ ప్రవేశ పెట్టింది. దీంతో మద్యం రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం వైదొలిగి లైసెన్స్ ఉన్న ప్రైవేట్ వ్యక్తులు లిక్కర్ స్టోర్లు నడిపే అవకాశం కలిగింది. బ్లాక్ మార్కెట్ నియంత్రించడం, ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకొచ్చామని ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం స్పష్టంచేసింది. న్యూ ఎక్సైజ్ పాలసీ ప్రకారం అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరచి ఉంచే అవకాశం ఉంది. లిక్కర్ స్టోర్లు డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ ఆదాయం 27 శాతం పెరిగింది. లిక్కర్ పాలసీలో నిబంధనలను తుంగలో తొక్కారని 2022 జూలైలో అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ బహిర్గతం చేశారు. లైసెన్స్ పొందిన కొందరికి లైసెన్స్ ఫీజుపై రూ.144 కోట్ల రాయితీ ఇచ్చారని వివరించారు. దాంతో అప్పటి లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. విపక్షాలు విమర్శించడంతో న్యూ ఎక్సైజ్ పాలసీని కేజ్రీవాల్ సర్కార్ వెనక్కి తీసుకుంది. గవర్నర్ సిఫారసు చేయడంతో 2022 ఆగస్టులో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తర్వాత ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సిసోడియా సహా 14 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.

అరెస్ట్ అయినవారు వీరే..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీస్ సిసోడియా, ఆప్ మీడియా ఇంచార్జీ విజయ్ నాయర్, లిక్కర్ రిటైల్ వ్యాపారి సమీర్ మహేంద్రను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2022 నవంబర్‌లో అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డి, లిక్కర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ బినయ్ బాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత శరత్ రెడ్డి అఫ్రూవర్‌గా మారారు. రాబిన్ డిస్టిల్లరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2023 ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ కవిత వద్ద సీఏగా పనిచేసిన బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతను అఫ్రూవర్‌గా మారాడు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారణకు రావాలని ఈడీ అధికారులు ఐదోసారి నోటీసులు జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 02 , 2024 | 08:16 AM