Share News

Lok Sabha Polls: తమిళనాట పోటాపోటీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:11 AM

తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్‌ జరుగనుంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా, వారి కోసం 68,321 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. 77 మంది మహిళా అభ్యర్థులు, 873 మంది పురుష అభ్యర్థులు కలిపి మొత్తం 950 మంది బరిలో

 Lok Sabha Polls: తమిళనాట పోటాపోటీ

39 నియోజకవర్గాలు.. 3 కూటములు.. 950 మంది అభ్యర్థులు.. 6.23 కోట్ల ఓటర్లు

డీఎంకే, బీజేపీ నేతృత్వ కూటముల మధ్యే హోరాహోరీ?

దక్షిణాది రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించిన కాషాయపార్టీ

(చెన్నై-ఆంధ్రజ్యోతి)

తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్‌ జరుగనుంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా, వారి కోసం 68,321 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. 77 మంది మహిళా అభ్యర్థులు, 873 మంది పురుష అభ్యర్థులు కలిపి మొత్తం 950 మంది బరిలో నిలిచారు. ఇందులో డీఎంకే నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి, బీజేపీ నేతృత్వంలోని ‘ఎన్డీయే’ కూటమి మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తున్నప్పటికీ, అన్నాడీఎంకే బాగా బలహీనపడటంతో డీఎంకే, బీజేపీ నేతృత్వంలోని కూటముల మధ్యే హోరాహోరీ నెలకొనే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమి తరఫున ప్రధాని మోదీ గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో 9 సార్లు పర్యటించి ప్రచారం చేయడం గమనార్హం. పలువురు కేంద్రమంత్రులు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్య లూ తమకు కలిసి వస్తాయని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇక ఇండియా కూట మి తరఫున కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి స్టాలిన్‌, అన్నాడీఎంకే కూటమి తరఫున మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నటుడు విజయకాంత్‌ సతీమణి ప్రేమలత తదితరులు ప్రచారం చేశారు. కాగా, బీఎస్పీ, నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీలు ఈ ఎన్నికల్లో ఏ కూటమిలోనూ చేరకుండా విడివిడిగానే 39 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి.

బీజేపీ నుంచి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను కోయంబత్తూరు నియోజకవర్గంలో, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను చెన్నై-దక్షిణ నియోజకవర్గంలో ఆ పార్టీ బరిలోకి దింపింది. అలాగే, కేంద్ర మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ను నీలగిరిలో, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ను కన్నియాకుమారిలో, ప్రముఖ సీనియర్‌ నటి రాధికను విరుదునగర్‌లో, ప్రముఖ పారిశ్రామికవేత్త వినోజ్‌ పి.సెల్వంను చెన్నై-సెంట్రల్‌ నుంచి బీజేపీ బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(రామనాథపురం), దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్‌, ఎస్‌ఆర్‌ఎం సంస్థల అధినేత టీఆర్‌ పారివేందర్‌ కూడా ఎన్డీయే తరఫున పోటీ చేస్తుండడం గమనార్హం.

డీఎంకే నుంచి హేమాహేమీలు..

ఇండియా కూటమిలో డీఎంకే తరఫున ీ కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి, స్టాలిన్‌ మేనల్లుడు దయానిధి మారన్‌ చెన్నై-సెంట్రల్‌ నుంచి, కేంద్ర మాజీ మంత్రులు టీఆర్‌ బాలు శ్రీపెరుంబుదుర్‌ నుంచి, ఎ.రాజా నీలగిరి నుంచి ఎస్‌.జగద్రక్షకన్‌ అరక్కోణం నుంచి బరిలో దిగారు.

కాంగ్రెస్‌ తరఫున

ఇండియా కూటమిలోనే కాంగ్రెస్‌ తరఫున కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శివగంగ నియోజకవర్గం నుంచి, తెలుగువారైన సీనియర్‌ నేత కె.గోపీనాథ్‌ కృష్ణగిరి నుంచి, సీనియర్‌ నేత మాణిక్కం ఠాగూర్‌ విరుదునగర్‌ నుంచి, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఎం.కృష్ణస్వామి తనయుడు ఎంకే విష్ణు ప్రసాద్‌ కడలూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే కూ టమిలో ఎండీఎంకే అధినేత వైగో కుమారుడు దురై వైగో తిరుచ్చి నుంచి బరిలో నిలిచారు. ఇక అన్నాడీఎంకే కూటమిలో సీనియర్‌ నేతలు, మాజీ ఎంపీలు బరిలో ఉన్నప్పటికీ చరిష్మా ఉన్న నేతలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు. ఈ కూటమిలో దివంగత నటుడు విజయకాంత్‌ స్థాపించిన డీఎండీకే తరఫున ఆయన తనయుడు విజ య ప్రభాకరన్‌ విరుదునగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, తమిళనాడుల డీఎంకే నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమిదే పైచేయి అని పలు ముందస్తు సర్వేలు తేల్చాయి.

Updated Date - Apr 19 , 2024 | 08:07 AM