Rahul Gandhi: రాయ్‌బరేలీలో రాహుల్ పోటీ.. వాయనాడ్ ప్రజల స్పందన ఇదే
ABN , Publish Date - May 04 , 2024 | 08:39 AM
రాయ్‌బరేలీ నుంచి పోటీపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు రాహుల్ నిర్ణయంలో తప్పేమీ లేదంటుండగా.. మరికొందరు వేరేలా స్పందిస్తున్నారు.
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వాయనాడ్‌తో(Wayanad)పాటు యూపీలోని రాయ్‌బరి(Raebareli) నుంచి కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారమే ఆయన రాయ్‌బరేలీ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. కేరళ రాష్ట్రం వాయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మరోసారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండటం ఆసక్తిగా మారింది.
వాయనాడ్ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. రాయ్‌బరేలికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. రాయ్‌బరేలీ నుంచి పోటీపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు రాహుల్ నిర్ణయంలో తప్పేమీ లేదంటుండగా.. మరికొందరు వేరేలా స్పందిస్తున్నారు. వాయనాడ్‌లోని ఓ షాప్ యజమానిని ఈ విషయంపై స్పందించమని కోరగా.. "రాహుల్ నిర్ణయంలో తప్పేమీ లేదు. ఆయన ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నారు.
కాబట్టి ఆయన నిర్ణయం సరైనదే" అని అన్నాడు. "రాహుల్ రెండు సీట్లలో గెలుస్తారు. ఒక సీటును వదిలేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు వయనాడ్‌ని వదిలేసే అవకాశం ఉంది" అని మరొకరు చెప్పారు. "ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయడం నాకు నచ్చలేదు. చూద్దాం ఏమవుతుందో" అని ఇంకొకరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత పీకే కున్హాలికుట్టి మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేయడంలో తప్పేమీ లేదన్నారు. "కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి.. రాహుల్ రెండు చోట్ల పోటీ చేయాలని కోరాం. ప్రధాని మోదీ గతంలో రెండు స్థానాల్లో పోటీ చేశారు. ఆయన పోటీ చేసినప్పుడు రాహుల్ చేస్తే తప్పేంటి.
రాహుల్ నిర్ణయం ఇండియా కూటమి బలాన్ని పెంచుతుంది" అని కున్హాలి అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ వాయనాడ్‌లో గెలుపొందారు కానీ యూపీలోని అమేథీలో ఓడిపోయారు. ఈ సారి వాయనాడ్ నుంచి సీపీఐ సీనియర్ నేత అన్నీ రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ నుంచి రాహుల్ పోటీ ఎదుర్కుంటున్నారు.
For Latest News and National News click here