Mumbai: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం..
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:26 PM
2019 ఎన్నికల్లో బాంద్రా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీషన్ సిద్ధిఖీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత ఆగస్టులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీషన్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని పార్టీ నుంచి అతన్ని కాంగ్రెస్ బహిష్కరించింది.
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల హత్యకు గురైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం ఆ పార్టీలో జీషన్ చేరారు. ఆయనకు అజిత్ పవార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
2019 ఎన్నికల్లో బాంద్రా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీషన్ సిద్ధిఖీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత ఆగస్టులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీషన్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని పార్టీ నుంచి అతన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. నవంబర్ 20న 288అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో అన్నీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి తనకు సిట్టింగ్ స్థానం వంద్రే ఈస్ట్ లభిస్తుందని ఆశించిన జీషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఉదయం ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలో చేరారు. వంద్రే ఈస్ట్ నియోజకవర్గం నుంచి జీషన్‌ను బరిలోకి దింపేందుకు అధిష్ఠానం సిద్ధమైంది.
అయితే వంద్రే ఈస్ట్ నుంచి మహా వికాస్ అఘాడీ తరఫున శివసేన(యూబీటీ) తమ అభ్యర్థిని నిలపనుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్.. జీషన్‌పై పోటీకి దిగనున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గం సీటును శివసేనకు అప్పగించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా తాము 255 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు మహా వికాస్ అఘాడీ బుధవారం రోజున ప్రకటించింది.
మరోవైపు వంద్రే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు కేటాయించడంపై అజిత్ పవార్‌కు జీషన్ సిద్ధిఖీ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలు తనవెంట ఉన్నారని, తన తండ్రి హత్య వారంతా కళ్లారా చూశారని ఆయన అన్నారు. తనకు, తన కుటుంబానికి అండగా నిలిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈసారి కూడా వంద్రే ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తానని, మరోసారి ప్రేమ, అభిమానాలతో నియోజకవర్గ ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించాలని జేషన్ కోరారు. కాగా ఇటీవల జేషన్ సిద్ధిఖీ తండ్రి బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసిన సంగతి తెలిసిందే.