AP Elections: ఏపీలో ఓటింగ్‌పై తెలుగు ప్రజల ఆసక్తి.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?
ABN , Publish Date - May 10 , 2024 | 05:35 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు (AP Elections) మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈసారి ఓటు వేయాల్సిందేనని తెలుగోడు గట్టిగా ఫిక్సయ్యాడు!. అందుకే దేశ విదేశాల్లో ఉన్న పలువురు ఓటర్లు ఇండియాకు విచ్చేయగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు (Telugu People) ఓటింగ్‌పై ఆసక్తిగా ఉన్నారు...
అమరావతి, ఆంధ్రజ్యోతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు (AP Elections) మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈసారి ఓటు వేయాల్సిందేనని తెలుగోడు గట్టిగా ఫిక్సయ్యాడు!. అందుకే దేశ విదేశాల్లో ఉన్న పలువురు ఓటర్లు ఇండియాకు విచ్చేయగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు (Telugu People) ఓటింగ్‌పై ఆసక్తిగా ఉన్నారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణ నుంచి ఏపీకి ఓటర్లు పయనమయ్యారు. పోలింగ్ తేదీ మే- 13కు ముందే స్వగ్రామాలకు ప్రజలు తరలివస్తున్నారు. దసరా, సంక్రాంతి పండగలను తలపిస్తూ 3రోజులు ముందుగానే.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.
వెళ్లాల్సిందే.. ఓటేయాల్సిందే..!
ఏపీకి రేపు, ఎల్లుండి ప్రయాణాలకు పెద్దఎత్తున బస్సు రిజర్వేషన్లు.. ట్రైన్ రిజర్వేషన్ల కోసం ప్రయాణికులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌తో ఏపీలో ఓట్ల సందడి మొదలైన విషయం తెలిసిందే. అయితే.. మే-13న (AP Polling Day) ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మూడురోజులు సెలవు కావడంతో సొంత ఊరువెళ్లి ఓటు వేయాలనే ఆలోచనలో బయట రాష్ట్రాల్లోని ఏపీ వాసులు ఉన్నారు. ప్రయాణ కష్టాలు ఉన్నా సరే.. ఏపీకి వెళ్లాల్సిందే.. ఓటేసి రావాల్సిందే అన్నట్లు ఓటరు ఉన్నారు. బైక్‌లు, కార్లు, బస్సులు, ట్రైన్ల ద్వారా వెల్లువలా ప్రజలు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఏపీకి వెళ్లగా.. శనివారం, ఆదివారం నాడు భారీగానే రాష్ట్రానికి వస్తారని.. కచ్చితంగా మునుపటి కంటే ఎక్కువగానే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
బస్సులు పెడ్తున్నం.. బయల్దేరండి!
ఇదిలా ఉంటే.. ‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఏపీలో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలను అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీల కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏపీలో ఓటు హక్కు ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏ ఒక్కరినీ అభ్యర్థులు వదిలిపెట్టడం లేదు. ప్రతి ఓటరుకు అభ్యర్థుల తరఫున స్థానిక నేతలు ఫోన్‌చేసి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల కంటే హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఏపీ ఓటర్లు ఉండడంతో వారిని రప్పించడంపైనే అభ్యర్థులంతా ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల వారీగా ఓటరు లిస్టుల్లో పేర్లున్న వారిని ఏకం చేసి వారిని రప్పించేందుకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
Read Latest AP News And Telugu News
200 కోట్లు ఖర్చు!
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లే ఓటర్లకు ఒక్కో బస్సుకు ఆర్టీసీ రూ.80వేల చొప్పున వసూలు చేస్తుండగా, ప్రైవేటు బస్సులకు రూ.1.20 లక్షలు ఇవ్వాలని ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఓట్లన్నీ పక్కాగా పడేవే కనుక ఆయా నియోజకవర్గాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతైనా ఖర్చుచేసేందుకు వెనుకాడడం లేదని సమాచారం. గత ఎన్నికలప్పటికంటే.. ఇపుడు చాలామందికి సొంత వాహనాలు ఉన్నాయి. సొంత వాహనాల్లేని వారికి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పిల్లాపాపలతో వెళ్లేందుకు ఓటర్లు సన్నద్ధం అవుతున్నారు. నియోజకవర్గానికి కనీసం 20 బస్సులు కావాలని డిమాండ్ ప్రధానంగా ఉంది. అయితే ఎంత ఖర్చు అయినా సరే అభ్యర్థులు మాత్రం అస్సలు వెనకాడట్లేదు. ఓటర్ల రవాణాకే 200 కోట్ల వ్యయం అయినట్లుగా సమాచారం.