Share News

YSRCP: బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. కీలక ప్రకటన

ABN , Publish Date - Jun 25 , 2024 | 10:38 PM

బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..

YSRCP: బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి (YSRCP) అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్న పరిస్థితి. దీనికి తోడు వైసీపీ హయాంలో వెలగబెట్టిన అవినీతి, జగన్ బాగోతం రోజుకొకటి బయటికి వస్తున్నాయి. వైజాగ్ రుషికొండతో మొదలై తాడేపల్లి ప్యాలెస్, పార్టీ కార్యాలయాలు.. ఆఖరికి బెంగళూరులోని జగన్ ప్యాలెస్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి. సరిగ్గా.. ఈ పరిస్థితుల్లోనే కేంద్రంలోని ఎన్డీఏ అండ కావాలని కోరుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘వైసీపీ మీతోనే ఉంది.. మీకు మద్దతు ఇస్తోంది’ అని అధికారిక ప్రకటన కూడా చేసేయడం గమనార్హం.


Modi-And-Jagan.jpg

అసలేం జరుగుతోంది..?

అవును.. ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఇస్తోంది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిగా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మరిన్ని పార్టీల మద్దతు కోసం అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా సైతం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో వైసీపీని ఎన్డీఏ అడిగిందో లేదో తెలియట్లేదు కానీ.. ఇదే అదునుగా చేసుకుని ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటన చేసేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి సమాచారం కూడా అందజేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన నలుగురు లోక్‌సభ ఎంపీలు పాల్గొంటున్నారు. ఇప్పటికే.. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి లోక్‌సభ సమావేశాల్లో భాగంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కడప ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి ఇంతవరకూ ప్రమాణం చేయలేదు. దీంతో స్పీకర్ ఎన్నికకు హాజరు కావాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో రెండ్రోజులపాటు సమావేశాలకు డుమ్మా కొట్టిన అవినాష్.. బుధవారం సభకు హాజరుకాబోతున్నారు.


Om-Birla.jpg

దగ్గరవుతోందా..?

వాస్తవానికి.. ఈ ఎన్నిక విషయంలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా వైసీపీ మిన్నకుండిపోతుందని అందరూ భావించారు కానీ.. అందరికంటే ముందుగానే ఎన్డీఏకు మద్దుతు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. కేంద్రంతో ఒకటా, రెండా ఎన్నో అవసరాలు ఉంటాయని అందుకే ఇలా సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఇస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా బిల్లుల ఆమోదం విషయంలో లోక్‌సభ.. రాజ్యసభలోనూ ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలానే ఎన్డీఏతో స్నేహపూర్వకంగా ఉండటానికి ఇలా చేస్తోందని.. వైసీపీపై కొందరు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి.

TDP.gif

ఇప్పటికే టీడీపీ ఇలా..?

ఎన్డీఏలో టీడీపీ మిత్రపక్షమైన సంగతి తెలిసిందే. స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ సైతం ఎంపీలకు విప్ జారీ చేయడం జరిగింది. పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసింది. బుధవారం నాడు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ మాజీ చీఫ్ విప్ విప్‌లో పార్టీ చీఫ్ జీఎం హరీష్ బాలయోగి పేర్కొన్నారు. మరోవైపు.. స్పీకర్‌ ఎన్నికలో ఓటింగ్‌పై ఎంపీలకు.. పార్లమెంటరీ పక్షనేతగా ఉన్న యంగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అంతేకాదు.. ఏపీ బీజేపీ, జనసేన సభ్యులను కూడా సమావేశానికి రావాలని టీడీపీ నుంచి ఆహ్వానం పంపడం జరిగింది. మొత్తానికి చూస్టే.. ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ మద్దతు ఓకే, వైసీపీ కూడా మద్దతు ఇస్తుండటంతో ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద బర్నింగ్ టాపిక్ అవుతోంది. సో.. ఎన్డీఏకు ఏపీలో శత్రువులైన టీడీపీ, వైసీపీ రెండూ మద్దతు పలుకుతున్నాయ్ అన్న మాట.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


Updated Date - Jun 25 , 2024 | 10:47 PM