Bengaluru: ఇలా ఉన్నావేంట్రా బాబూ.. హెల్మెట్ పెట్టుకోలేదని అడిగిన కానిస్టేబుల్ వేలిని కొరికేశాడు..
ABN , Publish Date - Feb 13 , 2024 | 01:54 PM
హెల్మెట్ ధరించండి - ప్రాణాలు కాపాడుకోండి.. అని ఎన్ని సార్లు చెప్పినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. రోడ్లపై ఎలాంటి జాగ్రత్తలు, నియమాలు పాటించకుండా రయ్యిమని దూసుకుపోతున్నారు.
హెల్మెట్ ధరించండి - ప్రాణాలు కాపాడుకోండి.. అని ఎన్ని సార్లు చెప్పినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. రోడ్లపై ఎలాంటి జాగ్రత్తలు, నియమాలు పాటించకుండా రయ్యిమని దూసుకుపోతున్నారు. వేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కన్నవాళ్లను కన్నీటి సంద్రంలో ముంచేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులు, అధికారులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. హెల్మెట్ ధరించేలా అవగాహన కలిగిస్తున్నారు. ధరించకపోతే జరిగే నష్టాన్ని వివరిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో పరిస్థితి కొంత మేరకు అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు. కానీ కొందరు ప్రబుద్ధులు మాత్రం ఇంకా మూర్ఖంగానే ప్రవర్తిస్తున్నారు. మమ్మల్నే అడుగుతారా అని కోపంతో రెచ్చిపోతున్నారు. తాజాగా బెంగళూరులోనూ అలాంటి ఘటనే జరిగింది.
నగరంలోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ రోడ్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బండి నడపడాన్ని గుర్తించి అతడ్ని అడ్డుకున్నారు. దీంతో సదరు యువకుడు కోపంతో ఊగిపోయాడు. నన్నే ఆపుతారా అంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ వీడియో తీశాడు. ఆ సమయంలోనూ ఎందుకు వీడియో తీస్తున్నావని ప్రశ్నించడం, బెదిరించడం వంటివి చూడవచ్చు.
అదే సమయంలో ఆ యువకుడి బండి తాళాలు తీసుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ చేతిని పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా వేలిని కొరికేశాడు. తీవ్ర బాధతో విలవిల్లాడిపోయిన కానిస్టేబుల్ అతడ్ని అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.