Share News

Viral Video: ఓవైపు గొడవ.. మరోవైపు రీల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

ABN , Publish Date - Jul 30 , 2024 | 08:39 PM

వీధుల్లో ఎవరైనా గొడవ పడుతుంటే జనాలు ఏం చేస్తారు? కొందరైతే సినిమా చూస్తున్నట్లు అలాగే చూస్తూ ఉండిపోతారు, మరికొందరేమో ఆ గొడవని ఆపేందుకు ప్రయత్నిస్తారు.

Viral Video: ఓవైపు గొడవ.. మరోవైపు రీల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
Viral Video

వీధుల్లో ఎవరైనా గొడవ పడుతుంటే జనాలు ఏం చేస్తారు? కొందరైతే సినిమా చూస్తున్నట్లు అలాగే చూస్తూ ఉండిపోతారు, మరికొందరేమో ఆ గొడవని ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. ఓ యువతి ఏం చేసిందో తెలుసా? ఆ సందర్భాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. ఆ ఉదంతంపై రీల్ (Instagram Reel) చేయడమే కాదు.. చిరునవ్వులు చిందిస్తూ స్టెప్పులేసింది. దీంతో.. నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ఇలాంటి పని చేసినందుకు సిగ్గుగా లేదా? అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


వీధిలో గొడవ

హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలో ఒక రోడ్డుపై కొందరు యువతీ యువకులు జుట్టు పట్టుకొని పోట్లాడుకుంటున్నారు. ఒక అబ్బాయిపై ముగ్గురు అమ్మాయిలు గొడవకు దిగగా.. అతను జుట్టు పట్టుకొని లాగుతున్నాడు. చుట్టూ ఉన్న జనాలు చోద్యం చూస్తుండగా.. కొందరు ముందుకొచ్చి వారిని విడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. అక్కడే ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. వారి సమీపానికి వెళ్లి, చూడండి ఎలా కొట్టుకుంటున్నారో అని నవ్వుతూ పేర్కొంది. ఆపై ఓ పంజాబీ పాటపై స్టెప్పులేసింది. ఓవైపు ఇతరులు వారిని ఆపే ప్రయత్నం చేస్తుంటే.. అదేదే సినిమా సీన్ అన్నట్టుగా ఆ యువతి డ్యాన్స్ చేస్తోంది. దీనిని తన ఇన్‌స్టాలో రీల్‌గా పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఆ యువతిపై నెటిజన్లు తారాస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కఠిన చర్యలు తీసుకోవాలి

ఈ వీడియోని నిఖిల్ సైని అనే నెటిజన్ నెట్టింట్లో షేర్ చేస్తూ.. ‘‘గత రెండు, మూడు సంవత్సరాలుగా సిమ్లా రిడ్జ్ ఇటువంటి భయంకరమైన కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రీల్స్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించేసుకున్నారు. ప్రతిరోజూ ఇలాంటి అర్ధంపర్థం లేని వీడియోలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఓ అమ్మాయి ఒక గొడవ సమయంలో తీసిన రీల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ గొడవను ఆపడానికి బదులుగా.. వాళ్లు దానిని రీల్‌గా మలచుకున్నారు. బహిరంగ ప్రదేశాలను కాపాడేందుకు గాను.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని స్థానిక అడ్మినిస్ట్రేషన్‌ని అభ్యర్థిస్తున్నాను’’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. మరో నెటిజన్ మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా వీళ్లే ఎక్కువయ్యారని, కానీ ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. ఇది అమానవీయమని, దురదృష్టవవాత్తూ ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకునే విధంగా చట్టంలో ఏమీ లేదని వాపోయారు. ఇంకొకరు స్పందిస్తూ.. రీల్ క్రియేటర్స్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో ప్రశాంతంగా తిరగలేని పరిస్థితి నెలకొందని, పోలీసుల చేతుల్ని ప్రభుత్వం కట్టిపడేసేందని పేర్కొన్నారు. ఇలాంటి వారు ప్రతిచోటా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని, కాబట్టి పర్యాటక ప్రాంతాల్లో వీరిపై అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎంని అభ్యర్థించారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jul 30 , 2024 | 08:39 PM