Share News

Mumbai: విషాదం.. ఫీల్డింగ్ చేస్తుండగా బంతి తగిలి ముంబై క్రికెటర్ మృతి

ABN , Publish Date - Jan 10 , 2024 | 12:55 PM

క్రికెట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన ఓ టోర్నమెంట్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా బంతి తగిలి సీనియర్ క్రికెటర్ మృతి చెందాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మరణించిన వ్యక్తి ఫీల్డింగ్ చేసింది ఒక మ్యాచ్‌లో అయితే.. బంతి వచ్చి తగిలింది మరో మ్యాచ్ నుంచి కావడం గమనార్హం.

Mumbai: విషాదం.. ఫీల్డింగ్ చేస్తుండగా బంతి తగిలి ముంబై క్రికెటర్ మృతి

ముంబై: క్రికెట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన ఓ టోర్నమెంట్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా బంతి తగిలి సీనియర్ క్రికెటర్ మృతి చెందాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మరణించిన వ్యక్తి ఫీల్డింగ్ చేసింది ఒక మ్యాచ్‌లో అయితే.. బంతి వచ్చి తగిలింది మరో మ్యాచ్ నుంచి కావడం గమనార్హం. ముంబైలోని మాతుంగాలో గల దాద్కర్ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తిని 52 ఏళ్ల జయేష్ సవాలాగా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 50 ఏళ్లు నిండిన వారి కోసం ముంబైలో కుచ్చి వీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్ అనే టీ 20 టోర్నమెంట్‌‌ను నిర్వహించారు. ఇలాంటి టోర్నమెంట్‌లు నిర్వహించినప్పుడు మైదానాల కొరత కారణంగా, ఒకే మైదానంలో రెండు పిచ్‌లు ఏర్పాటు చేసి రెండు మ్యాచ్‌లను ఒకేసారి నిర్వహిస్తుంటారు. ఒకానొక దశలో మూడు మ్యాచ్‌లు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి.


అదే విధంగా ఈ టోర్నీలోనూ ఒకే మైదానంలో రెండు పిచ్‌లు ఏర్పాటు చేసి, ఒకేసారి రెండు వేర్వేరు మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ టోర్నీలో జయేష్ సవాలా ఒక మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అతను మరొక మ్యాచ్‌లోని బ్యాటర్‌గా ఎదురుగా ఉన్నాడు. సదరు బ్యాటర్ బలంగా కొట్టిన బంతి వచ్చి జయేష్ చెవి వెనుక తగిలింది. దీంతో జయేష్ సవాలా వెంటనే కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే అతడిని లయన్ తారాచంద్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. జయేష్ సవాలా అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయంలో జయేష్ సవాలా ప్రాణాలు విడిచినట్టు తెలిపారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జయేష్ సవాలా మరణంలో ఎటువంటి కుట్రలేదని నిర్ధరించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా క్రికెట్ ఆడుతూ ఆటగాళ్లు చనిపోవడం ఇది కొత్తేం కాదు. గతంలో 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్ హ్యూస్ అనే యువ క్రికెటర్ కూడా బంతి తగిలి చనిపోయాడు.

Updated Date - Jan 10 , 2024 | 12:59 PM