Share News

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

ABN , Publish Date - Jan 22 , 2024 | 08:59 AM

ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు మరికాసేపట్లో తెరపడనుంది. ఎంతో కాలంగా కంటున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య పుణ్య క్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. వేలాది మంది అతిథుల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్న ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభంకానుంది.

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

అయోధ్య: ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు మరికాసేపట్లో తెరపడనుంది. ఎంతో కాలంగా కంటున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య పుణ్య క్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. వేలాది మంది అతిథుల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్న ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభంకానుంది. 12 గంటల 30 నిమిషాల 32 సెకన్లకు ప్రాణ ప్రతిష్ఠ ముగియనుంది. అంటే 84 సెకన్లపాటు మాత్రమే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన 7 వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ నుంచి వారికి ఆహ్వాన పత్రికలు కూడా అందాయి. రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి ఆహ్వాన పత్రికలు అందుకున్న వారిలో క్రీడా రంగానికి చెందినవారు కూడా చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా పలువురు ప్రముఖ క్రికెటర్లను బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు.


వారిలో మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, మిథాలీ రాజ్, గౌతం గంభీర్ ఉన్నారు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఆహ్వానం అందింది. కాగా క్రికెటర్లలో మొదటగా సచిన్ టెండూల్కర్‌కు ఆహ్వానం అందింది. మాజీ క్రికెటర్లంతా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవనున్నారు. ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్లలో ఆహ్వానం అందుకున్న కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ నలుగురు ఆటగాళ్లు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కోహ్లీ వెళ్తున్నాడని అధికారికంగా వెల్లడైంది. కాగా ఈ నెల 25 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా ఉన్నారు. ఇక అయోధ ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న ఇతర క్రీడాకారుల విషయానికొస్తే జావెలిన్ త్రో నుంచి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా, చెస్ దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపిచంద్, పరుగుల క్రీడా కారిణి పీటీ ఉష, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఉన్నారు. వీరితోపాటు కరణం మల్లేశ్వరి, కళ్యాణ్ చౌబే, దేవేంద ఝంజడ్లా, భైచుంగ్ భూటియా, బచేంద్రి పాల్, ప్రకాష్ పదుకొనేకు కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది.

Updated Date - Jan 22 , 2024 | 09:46 AM