Rohit Sharma: నేను సర్ఫరాజ్ తండ్రితో కలిసి ఆడా.. ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టిన రోహిత్
ABN , Publish Date - Mar 21 , 2024 | 11:39 AM
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన చిన్న తనంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి క్రికెట్ ఆడినట్టు చెప్పాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2024 (IPL 2024) ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన చిన్న తనంలో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) తండ్రితో కలిసి క్రికెట్ ఆడినట్టు చెప్పాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అరంగేట్రంలోనే మెరుపు ఇన్నింగ్స్‌లతో సంచలనంగా మారాడు. అంతకుముందు టీమిండియాలో స్థానం కోసం సర్ఫరాజ్ ఖాన్ చాలా కాలంగా ఎదురుచూశాడు. ఎట్టకేలకు అవకాశం రావడంతో ఒడిసిపట్టుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో మిడిలార్డర్ స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ కూడా క్రికెటర్ కావడం గమనార్హం. టీమిండియాకు ఆడాలని కలలు కన్నాడు. కానీ సాధ్యం కాలేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని నౌషాద్ ఖాన్ తన కొడుకులు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌ను క్రికెటర్లుగా తీర్చిదిద్దాడు. పెద్దవాడైన సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే భారత జట్టులోకి అడుగుపెట్టాడు. చిన్నవాడైన ముషీర్ అండర్ 19, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ టెస్ట్ క్యాప్ అందుకునే సమయంలో నౌషాద్ ఖాన్ భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.
అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ అనేక కీలక విషయాలు వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ గెలవడంలో కుర్రాళ్లు కీలక పాత్ర పోషించడంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నేను కుర్రాళ్లతో ఆడడాన్ని చాలా ఇష్టపడ్డాను. వారంతా చాలా అల్లరిచేసేవారు. వారిలో చాలా మంది నాకు ఇదివరకే బాగా తెలుసు. వారి బలాలు, వాళ్లు ఎలా ఆడాలనుకుంటారో తెలుసు. వాళ్లు ఎంత గొప్ప ఆటగాళ్లో చెప్పడం, ఇంతకుముందు ముందు ఎంత బాగా రాణించారో చెప్పడం ద్వారా వారిని ప్రోత్సహించడం నా బాధ్యత. వాళ్లు నాకు స్పందించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ అరంగేట్ర కుర్రాళ్లతో ఆడుతూ నేను మైమరిచిపోయాను. వారి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వారి తొలి ప్రదర్శనలు చూసి నేను చాలా ఆనందించాను. నేను నా చిన్నతనంలో కంగా లీగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి ఆడాను. అతని తండ్రి ఎడమచేతి బ్యాటర్. ఆయన దూకుడుగా ఉండేవాడు. ముంబై క్రికెట్ సర్కిల్‌లలో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కొడుకు భారతదేశం కోసం ఆడటం ద్వారా ఫలించిన ఆయన ప్రయత్నాన్ని, కృషిని నేను గుర్తించాలని అనుకుంటున్నాను. నేను అతనికి చెప్పాలనుకున్నాను. తన కుమారుడి టెస్టు క్యాప్ తన కుమారుడితో సమానం' అని రోహిత్ చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.