Share News

IND vs AFG: చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా.. పాకిస్థాన్‌ రికార్డును బద్దలు కొట్టి మరి..

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:42 PM

India vs Afghanistan: అప్ఘానిస్థాన్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇప్పటికే 2-0తో గెలుచుకున్న టీమిండియా ప్రస్తుతం క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. బుధవారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్ వాష్ చేయాలని పట్టుదలగా ఉంది.

IND vs AFG: చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా.. పాకిస్థాన్‌ రికార్డును బద్దలు కొట్టి మరి..

బెంగళూరు: అప్ఘానిస్థాన్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇప్పటికే 2-0తో గెలుచుకున్న టీమిండియా ప్రస్తుతం క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. బుధవారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్ వాష్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేస్తే టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో అత్యధిక సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. ఈ జాబితాలో ప్రస్తుతం పాకిస్థాన్‌తో కలిసి టీమిండియా సమంగా మొదటి స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 8 టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేశాయి. అప్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేస్తే పాకిస్థాన్ రికార్డును బద్దలుకొట్టనుంది. అత్యధికంగా 9 టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా భారత జట్టు అవతరించనుంది.


కాగా భారత జట్టు మొట్టమొదటిసారిగా 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత 2017లో శ్రీలంకతో సిరీస్‌ను, 2018లో వెస్టిండీస్‌తో సిరీస్‌ను, 2019లో వెస్టిండీస్‌తో సిరీస్‌ను, 2019/20లో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను, 2021లో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను, 2021లో వెస్టిండీస్‌తో సిరీస్‌ను, 2021లో శ్రీలంకతో సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 2019/20లో న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఏకంగా 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. మిగతా సిరీస్‌లన్నింటిని 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కాగా భారత జట్టు ఇప్పటికే స్వదేశంలో అజేయంగా వరుసగా 15 టీ20 సిరీస్‌లు గెలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అలాగే టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్ రికార్డును టీమిండియా ఇటీవల బ్రేక్ చేసింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో అత్యధికంగా 140 టీ20 విజయాలు ఉండగా.. పాకిస్థాన్ ఖాతాలో 135 విజయాలు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 17 , 2024 | 05:46 PM