Share News

Yashasvi Jaiswal: ఐసీసీ అవార్డు రేసులో యశస్వీ జైస్వాల్

ABN , Publish Date - Mar 04 , 2024 | 06:27 PM

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. ఫిబ్రవరి నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినీస్ షార్ట్ లిస్ట్ జాబితాలో జైస్వాల్‌కు చోటుదక్కింది.

Yashasvi Jaiswal: ఐసీసీ అవార్డు రేసులో యశస్వీ జైస్వాల్

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. ఫిబ్రవరి నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినీస్ షార్ట్ లిస్ట్ జాబితాలో జైస్వాల్‌కు చోటుదక్కింది. ఈ అవార్డు రేసులో యశస్వీ జైస్వాల్‌తోపాటు న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్, శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సాంక కూడా ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో దుమ్ములేపుతున్న జైస్వాల్ 8 ఇన్నింగ్స్‌ల్లో 655 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫిబ్రవరి నెలలోనే 112 సగటుతో 560 పరుగులు చేశాడు.


ఇంగ్లండ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్.. వైజాగ్ వేదికగా జరిగిన రెండు, రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలు బాదాడు. వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ తర్వాత వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు. ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టులో 45 పరుగులు చేస్తే ఈ సిరీస్‌లో జైస్వాల్ 700 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇక ఈ అవార్డు రేసులో ఉన్న మరో ఆటగాడు కేన్ విలియమ్సన్ సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌లో 403 పరుగులు చేశాడు. అప్ఘానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో శ్రీలంక ఆటగాడు నిస్సాంక డబుల్ సెంచరీతో చెలరేగాడు. కాగా స్వతంత్ర ఓటింగ్ అకాడమీతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభమానులు ఓటింగ్ పద్దతిలో విజేతను ఎన్నుకుంటారు. వచ్చే వారం విజేతలను ప్రకటించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 06:29 PM