Share News

Jagdeep Dhankhar: మా ఇంటికి భోజనానికి రండి

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:24 AM

మెదక్‌ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించారని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెప్పారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం తునికి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ ఎరువులతో పంటలు పండించిన రైతులతో సమ్మేళనం నిర్వహించారు.

Jagdeep Dhankhar: మా ఇంటికి భోజనానికి రండి

  • సేంద్రియ సాగు రైతులకు ఉపరాష్ట్రపతి ఆహ్వానం

  • తునికి కృషి విజ్ఞాన సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌

నర్సాపూర్‌/కౌడిపల్లి, శంషాబాద్‌ రూరల్‌, హైదరాబాద్‌, నందిగామ, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి): మెదక్‌ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించారని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెప్పారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం తునికి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ ఎరువులతో పంటలు పండించిన రైతులతో సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తోపాటు ఉపరాష్ట్రపతి సతీమణి సుదేశీ ధన్‌ఖడ్‌, గవర్నర్‌ జిష్టుదేవ్‌వర్మ, మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌రావు పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో తునికి కేంద్రానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి తొలుత మొక్క నాటి సేంద్రియ ఎరువులకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌తో పాటు పంటలను కూడా పరిశీలించారు.


అనంతరం రైతులతో నిర్వహించిన సమ్మేళనంలో మాట్లాడుతూ తునికి గ్రామం చిన్నది కాదని, అందరికీ ఆదర్శమన్నారు. తునికి గ్రామ రైతులు సేంద్రియ సాగులో తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, మార్పు సాధించారని కితాబునిచ్చారు. ఈ గ్రామ సేంద్రియ సాగు రైతులందరూ 3 రోజుల పాటు ఢిల్లీలో తన స్వగృహానికి అతిథులుగా రావాలని ధన్‌ఖడ్‌ ఆహ్వానించారు. త్వరలో కిసాన్‌ దివస్‌ రజతోత్సవం నిర్వహించబోతున్నామని, దేశంలోని 730 పైచిలుకు కృషి విజ్ఞాన కేంద్రాలు, 150 ఐకార్‌ సంస్థలు ఈ ఉత్సవాలలో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ విద్యుత్‌ సబ్సిడీలపై ఆధారపడకుండా సోలార్‌ విద్యుత్‌ వినియోగించుకునే విధంగా రైతులను చైతన్యపర్చాలని అన్నారు. రైతులు ఆందోళనలో ఉన్నారని, వారితో చర్చించి వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.


కన్హాశాంతివనానికి ధన్‌ఖడ్‌

తునికి నుంచి ఉపరాష్ట్రపతి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలపరిధిలోని కన్హాశాంతివనానికి చేరుకున్నారు. ఆ తర్వాత గురూజీ కమలేష్‌ పటేల్‌తో ధన్‌ఖడ్‌ సమావేశఽమయ్యారు. అనంతరం ధ్యానంలో నిమగ్నమయ్యారు. రాత్రికి కన్హాశాంతివనంలో బసచేసి గురువారం ఉదయం 11 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.


ఉప రాష్ట్రపతి దంపతులకు ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్రపర్యటనకు విచ్చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌ దంపతులకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్రగవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, రాష్ట్రప్రభుత్వం తరఫున పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, వద్దిరాజు రవిచంద్ర, సురే్‌షరెడ్డి తదితరులు కూడా స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు హెలికాప్టర్‌లో మెదక్‌ జిల్లా తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్లారు.

Updated Date - Dec 26 , 2024 | 05:24 AM