CM Revanth Reddy: అలాంటి వారు ఊర్లల్లోకి వస్తే తగిన బుద్ధి చెప్పండి
ABN , Publish Date - Feb 02 , 2024 | 05:13 PM
స్వయం సహాహక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం నాడు ఆదిలాబాద్‌లో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్: స్వయం సహాహక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం నాడు ఆదిలాబాద్‌లో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బాంకు లింకేజీ చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం.. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు.
త్వరలోనే ప్రియాంక గాంధీని పిలిచి రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పారు. త్వరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారని... అలాంటి వారు ఊర్లల్లోకి వస్తే తగిన బుద్ధి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
కాగా.. ఇంద్రవెల్లి స్మారక స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఇంద్రవెల్లి అమరుల స్మృతి వనం అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఇంద్రవెళ్లి జనసంద్రంగా మారింది. తెలంగాణ పునర్ నిర్మాణ సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆదిలాబాద్ - మంచిర్యాల రూట్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు దీరాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.