Tiger: ఆ మూడు జిల్లాల ప్రజలను వణికిస్తున్న పెద్దపులి..
ABN , Publish Date - Nov 11 , 2024 | 08:50 AM
కొన్ని రోజులుగా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే తాజాగా అది ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది.
నిర్మల్: మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలను పెద్దపులి భయం వెంటాడుతోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ రోడ్డుపై పెద్దపులి కనిపించింది. జాతీయ రహదారిపై దాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు వంటి వాహనాలు ఆపి పులి వెళ్లే వరకూ అక్కడే ఆగిపోయారు. అయితే రోడ్డు దాడుతున్న పెద్దపులిని పలువురు యువకులు తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొన్ని రోజులుగా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే తాజాగా అది ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పెద్దపులి సంచారంతో ఇస్పూర్, గౌలిగూడ, చింతగూడ, లింగట్ల, ఆరెపల్లి, వాంకిడి గ్రామాల ప్రజలకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో అంటూ వణికిపోతున్నారు. అయితే ప్రస్తుతం అది కవ్వాల్ టైగర్ జోన్ వైపు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నేరడిగొండ అటవీ శాఖ సిబ్బంది పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇదే పులి మామిడిగూడెం పంచాయతీ గోండుగూడ సమీపంలో గత ఆదివారం సంచరించింది. చిత్రు అనే రైతుకు చెందిన ఆవులమందపై దాడి చేసి ఏకంగా మూడు ఆవులను చంపి తినేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అలాగే శనివారం నాడు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దధర్మారం సమీపంలో కనిపించిందని గ్రామస్థులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున పెద్దపులి వచ్చిందని, గ్రామ సమీపంలో పులి అడుగులు కనిపించాయని చెప్పారు. పెద్దపులి అరుపులు విన్నట్లు మరికొంత మంది రైతులు, పశువుల కాపరులు సైతం వెల్లడించారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పత్తి పంట చేతికి వచ్చిందని, కానీ పులి భయంతో కూలీలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ముత్యంపల్లి అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. రైతులు, పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలను అప్రమత్తం చేశారు. అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని వారిని హెచ్చరించారు. పులి జాడ తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. పులి కనిపిస్తే ఎలాంటి దాడి చేయవద్దని, దానికి హాని కలిగించవద్దని సూచించారు. తాజాగా మూడ్రోజుల క్రితం సురక్షిత ఆవాసం కోసం కవ్వాల్ టైగర్ జోన్‌లోకి పెద్దపులి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు.