Amit Shah: మరో 9 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల రాక
ABN , Publish Date - Sep 02 , 2024 | 04:29 AM
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఆదేశించారు.
అమిత్ షాకు సంజయ్ ఫోన్.. వర్షాల తీవ్రతపై సమాచారం
హైదరాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఆదేశించారు. ఆదివారం ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణలో భారీ వర్షాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరిస్థితిని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్‌నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరాతండా గుట్టపైన 68 మంది, భవనాలపైన 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు వివరించారు.
స్పందించిన ఆయన తెలంగాణకు అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. షా ఆదేశాలతో చెన్నై, విశాఖపట్నం, అసోం నుండి 3 చొప్పున మొత్తం 9 బృందాలు తెలంగాణకు వచ్చాయని సంజయ్ ఎక్స్ వేదికగా తెలిపారు. అదే సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన సంజయ్.. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం బండి సంజయ్ ఖమ్మం జిల్లాలో వరదలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్రం అదనంగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించిందని తెలిపారు.