Share News

Bandi Sanjay: అరెస్టు కాంగ్రెస్‌ డ్రామా : బండి సంజయ్‌

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:40 AM

ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్‌ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: అరెస్టు కాంగ్రెస్‌ డ్రామా : బండి సంజయ్‌

ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్‌ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. కాంగ్రె్‌సకు పాలనాదక్షత శూన్యమని, నాటకాలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ అధికమని ఎక్స్‌లో పోస్టు చేశారు. సంచలన ఘటనలు కాంగ్రెస్‌ అసమర్థతను దాచిపెట్టవని, ఆ పార్టీ డ్రామాలను యావత్‌ దేశం గమనిస్తోందని అన్నారు. దుస్తులు మార్చుకునే సమయమివ్వకుండా పడక గది నుంచి అర్జున్‌ను పోలీసులు తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య అన్నారు.


  • తప్పును కప్పిపుచ్చుకునేందుకే అరెస్టు : అశ్వినీ వైష్ణవ్‌

    8.jpg

ప్రభుత్వం, యంత్రాంగం తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అర్జున్‌ను అరెస్టు చేశారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆరోపించారు. సినీ పరిశ్రమ అంటే కాంగ్రెస్‌ పార్టీకి గౌరవం లేదనే విషయం అల్లు అర్జున్‌ అరెస్టుతో మరోసారి రుజువైందని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. థియేటర్‌ వద్ద జరిగిన దుర్ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే : లక్ష్మణ్‌

8.jpg

సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటనలో ప్రత్యక్ష ప్రమేయం లేకున్నా అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం అమానుషమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం సినిమా స్ర్కిప్టు రచించిందని ఆరోపించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.


నాయకులకు ఓ న్యాయం.. నటులకు ఇంకో న్యాయమా ? : కేఏ పాల్‌

8.jpg

రాజకీయ నాయకులకు ఓ న్యాయం, సినీ నటులు, సామాన్య ప్రజలకు మరో న్యాయమా ? అని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్‌ ప్రశ్నించారు. చంద్రబాబు కందుకూరు వెళ్లినపుడు జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఆ ఘటనలో చంద్రబాబుని అరెస్టు చేశారా? అని ప్రశ్నించారు.


అరెస్టు సమ్మతం కాదు: జగన్‌

8.jpg

అల్లు అర్జున్‌ అరెస్టును వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎక్స్‌ వేదికగా ఖండించారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అల్లు అర్జున్‌పై నేరుగా కేసులు బనాయించి మరీ అరెస్టు చేయడం ఏమాత్రం సమ్మతం కాదని ఆయన ట్వీట్‌ చేశారు. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనని పేర్కొన్న జగన్‌.. ఆ సమయంలో అల్లు అర్జున్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించారని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని అన్నారని చెప్పారు.

Updated Date - Dec 14 , 2024 | 03:41 AM