Share News

BJP: పది ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది..

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:56 AM

‘దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన 10 ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర బీజేపీది.. సుప్రీంకోర్టుతో చీవాట్లు తింటూనే.. ఈడీ, సీబీఐ, ఐటీలతో బెదిరించి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది.

BJP: పది ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది..

  • ఫిరాయింపులపై మీరా నీతులు చెప్పేది?

  • కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ ఎంపీ చామల ధ్వజం

  • విద్యుత్తు సంస్థలు ప్రైవేట్‌కు అప్పగిస్తే పోరాటమే..: మల్లు రవి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ‘దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన 10 ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర బీజేపీది.. సుప్రీంకోర్టుతో చీవాట్లు తింటూనే.. ఈడీ, సీబీఐ, ఐటీలతో బెదిరించి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఫిరాయుంపులపై నీతులు చెబుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఇవి కనిపించట్లేదా?’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన మోహన్‌యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న అక్కడి బీజేపీ సర్కారు.. ఆయనతో ఇప్పటికీ రాజీనామా చేయించలేదని విమర్శించారు. అది రాజ్యాంగ అవహేళన కిందకు రాదా అంటూ కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సైతం.. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను రాజీనామా చేయించకుండానే మంత్రివర్గంలోకి తీసుకుందని గుర్తు చేశారు.


కవితకు బెయిల్‌ కోసం మోదీ కాళ్లు పట్టుకోవడానికి కేసీఆర్‌ కుటుంబం సిద్ధమైందని ఆరోపించారు. విద్యుత్తు సంస్థలను ప్రైవేట్‌కు అప్పగిస్తే ఊరుకోబోమని, విద్యుత్తు ఉద్యోగులతో కలసి కేంద్రంపై పోరాడుతామని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రభుత్వ సంస్థలున్నప్పుడే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని.. రైతులకు ఉచిత కరెంట్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కాంగ్రె్‌సతోనే సాధ్యమైందని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాలనలో అప్పటి దేశ పరిస్థితుల దృష్ట్యా విధించిన ఎమర్జెన్సీని రాజ్యాంగ సంవిధాన్‌ హత్య దివ్‌సగా అభివర్ణిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. బీజేపీ పాలనలో జరిగిన గోద్రా, మణిపూర్‌ అల్లర్లను ఏమంటారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. తాను చేసే పనులకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయం అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వంపై ఎమర్జెన్సీ ప్రభావం ఏమాత్రం లేదని, 1977లో ఓడిన మూడేళ్లకే 1980లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన సంగతి బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.

Updated Date - Jul 14 , 2024 | 03:56 AM