Share News

Hyderabad: సీఎం క్షమాపణ చెప్పాల్సిందే!

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:12 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసనలతో రెండో రోజూ అసెంబ్లీ హోరెత్తింది. గురువారం ఉదయం కేటీఆర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి సభలోకి వచ్చారు.

Hyderabad: సీఎం క్షమాపణ చెప్పాల్సిందే!

  • స్పీకర్‌ వద్ద పోడియం ఎదుట బైఠాయించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నినాదాలు

  • సీఎం చాంబర్‌ వద్ద కూడా బైఠాయింపు

  • మోసుకుంటూ బయటకు తెచ్చిన మార్షల్స్‌

  • అరెస్టు... తెలంగాణ భవన్‌కు తరలింపు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసనలతో రెండో రోజూ అసెంబ్లీ హోరెత్తింది. గురువారం ఉదయం కేటీఆర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి సభలోకి వచ్చారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ముగ్గురు మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి సభ జరుగుతున్నంత సేపు శాసన సభా కార్యదర్శి టేబుల్‌ ఎదుట నిల్చొని నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి... సీఎం డౌన్‌ డౌన్‌... సీఎం అహంకారపూరిత వైఖరి నశించాలి.. అంటూ నినదించారు. ఈ అరుపులు, కేకల మధ్యనే ‘స్కిల్‌ యూనివర్సిటీ బిల్లు’ను మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. బిల్లు సారాంశాన్ని మంత్రి వివరిస్తుండగా.. వివరణ అక్కర్లేదంటూ హరీశ్‌రావు, కేటీఆర్‌ లేచి నిలబడి, నినాదాలు చేశారు.


దీంతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ జోక్యం చేసుకొని.. ‘సభ నడవాలని లేదా...? సభా మర్యాదను కాపాడాలని లేదా...?’అంటూ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ సభ్యులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు కోసం స్కిల్‌ వర్సిటీ బిల్లు పెడితే స్వాగతించకుండా నిరసనలేంటి? అని ఆక్షేపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారు నిబంధనలకు విరుద్ధంగా సభలో నినాదాలు చేయడం తగదని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన మంచి పద్ధతి కాదని అన్నారు. దీంతో బీజేపీ, కాంగ్రె్‌సను ఉద్దేశించి.. బడే భాయ్‌, చోటా భాయ్‌ ఏక్‌ హోగయా అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు నినదించారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ఇది పూర్తిగా కౌరవ సభగా మారిందని, అంతిమంగా పాండవులదే విజయమని అన్నారు. స్కిల్‌ వర్సిటీ ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.


  • సీఎం చాంబర్‌ వద్ద బైఠాయింపు

సభలో నిరసన తర్వాత కేటీఆర్‌ ఆధ్వర్యంలో హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పద్మారావు, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎం చాంబర్‌ వద్ద బైఠాయించారు. దీంతో మార్షల్స్‌.. వారందన్నీ మోసుకుంటూ వెలుపలకు తీసుకురాగా.. పోలీసులు అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎంగా రేవంత్‌ అన్‌ఫిట్‌ అని విమర్శించారు. కాగా, సీఎం చాంబర్‌ ఎదుట నిరసన వీడియో బయటకు రావడంపై సీరియస్‌ అయిన స్పీకర్‌.. సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం.


  • జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన

హైదరాబాద్‌ సిటీ: మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి అవమానించారంటూ పలు చోట్ల బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన చేపట్టాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచి బజాజ్‌ ఎలక్ర్టానిక్స్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిజాం కళాశాల నుంచి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్వీ నాయకులను బషీర్‌బాగ్‌ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపుర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. హనుమకొండలోని కాళోజీ జంక్షన్‌ వద్ద దాస్యం వినయభాస్కర్‌ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేశారు. ఎల్కతుర్తి, వేలేరు, పరకాలలోనూ నిరసనలు కొనసాగాయి.

Updated Date - Aug 02 , 2024 | 04:12 AM