Prahlad Joshi: నీతి ఆయోగ్ సమావేశాన్ని రేవంత్ బహిష్కరించడం సరికాదు
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:49 AM
నీతి ఆయోగ్ సమావేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బహిష్కరించడం సరికాదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
ఆ నిర్ణయం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే..
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్ సమావేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బహిష్కరించడం సరికాదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధిగా నీతి ఆయోగ్ పనిచేస్తుందని, ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైనా ప్రస్తావించడానికి ముఖ్య వేదిక నీతి ఆయోగ్ సమావేశమన్నారు. ‘ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలయిపోయాయి. ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు. అభివృద్ధి, ప్రగతి కావాలి. ఇంతకుముందు బీఆర్‌ఎస్ ఇలాగే రాజకీయాలు చేస్తే రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, బిహార్ రాష్ట్రాల పేర్లే ఉన్నాయన్న కాంగ్రెస్ విమర్శపై ఆయన మాట్లాడుతూ.. 2009లో యూపీయే ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యూపీ, బిహార్‌ల పేర్లు మాత్రమే ఉన్నాయని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. బడ్జెట్‌లో మిగతా రాష్ట్రాల పేర్లు లేనంత మాత్రాన వాటికేమీ చేయడం లేదన్నట్లు కాదన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి పన్నుల బదలాయింపు రూపేణా రూ.18.50లక్షల కోట్లు రాగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణకు రూ.69.60లక్షల కోట్లు వచ్చాయని, ఈ లెక్కన 276శాతం పెరుగుదల ఉందని ఆయన వివరించారు. నగరాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తికి ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.