KTR: నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ కక్ష..
ABN , Publish Date - Jul 21 , 2024 | 03:46 AM
నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష గట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉన్న భయానక వాతావరణం ఇప్పుడు తిరిగి పునరావృతం అవుతోందని చెప్పారు.
రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారు
దాడులు అప్రజాస్వామికం: కేటీఆర్
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష గట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉన్న భయానక వాతావరణం ఇప్పుడు తిరిగి పునరావృతం అవుతోందని చెప్పారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశాలపై శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
ఉస్మానియా వర్సిటీ విద్యార్థులపై జరిగిన దాడుల గురించి గవర్నర్‌కు వివరించామని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కుతూ తమ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలో చేర్చుకున్న విషయాన్నీ వివరించామన్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోక తప్పదని కేటీఆర్ అన్నారు. అక్కడ జరిగింది చిన్న విషయమే తప్ప... పెద్ద తప్పిదం కాదన్నారు. భారీ వరదను సైతం మేడిగడ్డ తట్టుకుని నిలబడడమే దీనికి నిదర్శనమన్నారు. త్వరలోనే తాము మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామన్నారు.