CM Revanth Reddy: అదానీకి ప్రధాని అండ
ABN , Publish Date - Dec 19 , 2024 | 03:08 AM
అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన దేశం పరువు తీశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు.
ఇద్దరూ కలిసి దేశం పరువు తీశారు
కాంగ్రెస్ 75 ఏళ్లలో పెంచిన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు
అదానీ అవినీతిపై జేపీసీ ఎందుకు వేయడంలేదు?
బీఆర్‌ఎస్ ప్రజల వైపా? అదానీ, ప్రధాని వైపా?
ఆ పార్టీ వైఖరేంటో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ చెప్పాలి
మోదీ జైల్లో పెడతారనే భయంతోనే మాట్లాడటం లేదు
జేపీసీపై బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తే అసెంబ్లీ తీర్మానం
నిరసన తెలిపే హక్కు సీఎంకూ ఉంటుంది: రేవంత్‌రెడ్డి
టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్
సీఎం, మంత్రులు, నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ ముందు రోడ్డుపై సీఎం బైఠాయింపు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన దేశం పరువు తీశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లు కష్టపడి పెంచిన దేశ ప్రతిష్ఠను ప్రధాని, అదానీ అనుబంధం దెబ్బతీస్తోందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రజల వైపు ఉంటారా? అదానీ-ప్రధాని వైపు ఉంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్ కుటుంబం భయపడుతోందన్నారు. అమెరికాలో అదానీపై నమోదైన కేసుల్లో, ఆర్థిక అవకతవకలపై జేపీసీ వేసి విచారణ జరపాలని, మణిపూర్‌లో తీవ్రమైన శాంతిభద్రతల సమస్య ఉన్నప్పటికీ ప్రధాని మోదీ ఇప్పటివరకు సందర్శించక పోవడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమం చేపట్టారు.
నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ రోటరీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు రాజ్‌భవన్‌కు సమీపంలోనే బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ ముందే రోడ్డుపై బైఠాయించారు. ప్రధాని, అదానీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్‌బీఐ నివేదించడంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు పూనుకుందని తెలిపారు. దేశ పరువును మంటగలిపిన అదానీపై విచారణ జరగాలని, ఈ విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని డిమాండ్ చేశారు. కానీ, అదానీ అవినీతిపై చర్చకు, జేపీసీ వేసేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరని అన్నారు. అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సివస్తుందని ఆయనను కాపాడేందుకే మోదీ యత్నిస్తున్నారని తెలిపారు. దీనిపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్నారు.
ప్రజల వైపా? అదానీ, ప్రధాని వైపా?
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడమేంటని కొందరు అనుకోవచ్చని, కానీ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చట్టసభలను స్తంభింపజేసినా, ఎన్ని నిరసనలు చేపట్టినా మోదీ దిగిరావడం లేదని, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు. ‘‘ముఖ్యమంత్రి నిరసన ఎలా చేస్తాడని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. అయితే నేను చేయను.. మరి మీరు చేయాలి. అదానీ విషయంలో కేసీఆర్ విధానమేంటో చెప్పాలి. బీజేపీ పెద్దల కాళ్లు మొక్కి అరెస్టులను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే అదానీపై వారు స్పందించడం లేదు. అదానీపై, జేపీసీపై మీ వైఖరేంటో చెప్పి.. మీ ఎంపీలతో లేఖ రాయించాలి’’ అని సీఎం రేవంత్ అన్నారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని, నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వారని విమర్శించారు. బీఆర్‌ఎస్ జేపీసీపై డిమాండ్ చేస్తే అసెంబ్లీ తీర్మానం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ట్విటర్‌లో కారుకూతలు కూయకుండా చర్చకు రావాలని సవాల్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశ సంపదను, వనరులను బీజేపీ నాయకత్వానికి దగ్గరగా ఉండే కొద్దిమందికి దోచి పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే అదానీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ అన్నారు. జాతి వివక్షతో మణిపూర్ రాష్ట్రం తగలబడుతున్నా మోదీ మౌనం దాలుస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ మాట్లాడుతూ అదానీ కుంభకోణాలపై ఎన్డీఏ ప్రభుత్వం జేపీసీ వేయడానికి ఎందుకు జంకుతోందని ప్రశ్నించారు.
ఇందిరా రోటరీ నుంచి సీఎం ర్యాలీ..
చలో రాజ్‌భవన్ ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల నుంచి 12.45కు నేరుగా చేరుకున్నారు. నేతలు, కార్యకర్తలంతా ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో భారీగా నిల్చోగా.. సీఎం రేవంత్‌తోపాటు మంత్రులు విగ్రహం వైపు వెళ్లకుండా ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ముందుకు సాగగా.. వెనకాల సీఎం, మంత్రులు, నేతల వాహన శ్రేణి కదిలింది. అయితే రాజ్‌భవన్ వరకు ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వకపోవడంతో నేతలంతా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ ఎదుట రోడ్డుపైనే బైఠాయించారు. మోదీ, అదానీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై సీఎం బైఠాయింపు నేపథ్యంలో ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వైపు రోడ్డును పూర్తిగా మూసేశారు. రాజ్‌భవన్‌కు ఇరువైపులా వంద మీటర్ల మేర బారికేడ్లను ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతలెవరూ రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.